ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్‌కి తాజాగా మరో 5 ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు లభించాయి. హాలీవుడ్‌లో అందరూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఇచ్చే అవార్డులలో 5 అవార్డులని ఆర్ఆర్ఆర్ గెలుచుకొంది. బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు) విభాగాలలో ఈ అవార్డులు గెలుచుకొంది. ది ఉమన్ కింగ్, ది బ్యాట్ మ్యాన్, బ్లాక్ పాంథర్ వంటి హాలీవుడ్ సినిమాలని వెనక్కినెట్టి ఆర్ఆర్ఆర్ ఈ అవార్డులు గెలుచుకోవడం విశేషం.
ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు రాజమౌళి ఈ కార్యక్రమానికి విచ్చేసినవారిని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ, “మా ఈ సినిమాకి సల్మాన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేయగా, విదేశం నుంచి భారత్ వచ్చిన స్టంట్ మాస్టర్ జూజీ కూడా మా సినిమా కాన్సెప్ట్, కధ, మా విజన్, అవసరాలు అన్నీ అర్దం చేసుకొని మా సినిమాకి యాక్షన్ సన్నివేశాలకి కొరియోగ్రఫీ చేశారు. కనుక ఈ క్రెడిట్‌లో స్టంట్ కొరియోగ్రాఫర్స్ భాగం ఉంది.
ఈ సందర్భంగా నేను హెచ్‌సీఏకి ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపై అవార్డుల విభాగంలో బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్‌ని కూడా ప్రవేశపెట్టాలని కోరుతున్నాను. మా ఈ సినిమాలో ఒకటి రెండు సన్నివేశాలు తప్ప మిగిలిన స్టంట్స్ అన్నీ రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ స్వయంగా చేశారు. ఈ సినిమాని 320 రోజులు షూటింగ్ చేయగా ఎక్కువ రోజులు ఈ స్టంట్స్ సీన్స్ చేయవలసి వచ్చింది. మా ఈ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులివ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది నాకు, నా చిత్రబృందానికే కాదు... మా భారతీయ చిత్ర పరిశ్రమకి లభించిన గౌరవంగా భావిస్తున్నాను. మేరా భారత్ మహాన్... జై హింద్,” అంటూ రాజమౌళి తన ప్రసంగం ముగించారు.