గుడ్ మార్నింగ్ అమెరికాలో రామ్ చరణ్‌ సందడి

అమెరికా పర్యటనలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, అక్కడ చాలా పాపులర్ టీవీ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో పాల్గొన్నారు. అమెరికన్లు ఎంతగానో ఇష్టపడే ఈ షోలో హాలీవుడ్ సుప్రసిద్ద నటులు ర్యాన్ రోనాల్డ్, టామ్ క్రూజ్, లియోనార్డ్ డికాప్రియో వంటివారు ఎక్కువగా పాల్గొంటుంటారు. మొట్టమొదటిసారిగా టాలీవుడ్‌ హీరో రామ్ చరణ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. రామ్ చరణ్‌ వస్తున్నట్లు తెలుసుకొని ఆయనని చూసేందుకు అభిమానులు అక్కడికి వచ్చారు. రామ్ చరణ్‌ వారితో సెల్ఫీలు దిగి ఆనందపరిచారు. 

తర్వాత ఈ నెల 24న బేవార్లీ హిల్స్ లో జరుగబోయే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఆర్ఆర్ఆర్‌ సినిమా కూడా ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులకి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి ప్రజెంటర్‌గా వ్యవహరించాలని ఆ సంస్థ రామ్ చరణ్‌ని ఆహ్వానించడం మరో విశేషం. కనుక ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్‌ సినిమాకి స్వయంగా అవార్డు అందుకోవడమే కాకుండా, ఇదే వేదికపై రామ్ చరణ్‌ మరొకరికి అవార్డు అందజేయబోతున్నారు. మార్చి 12వ తేదీన లాస్ ఏంజలీస్ నగరంలో డల్బీ థియేటర్‌లో ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతుంది. అప్పటి వరకు రామ్ చరణ్‌ అమెరికాలోనే ఉంటూ ఇటువంటి వివిద కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు.