కె.విశ్వనాథ్ దర్శకత్వంలో జాలువారిన అనేక ఆణిముత్యాలలో సాగర సంగమం కూడా ఒకటి. దానిలో జయప్రద పాత్రకి మొదట జయసుధని అనుకొన్నారుట! అందుకోసం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జయసుధకి అడ్వాన్స్ కూడా ఇచ్చారట! అయితే ఆ సినిమాలో ప్రధానపాత్ర చేసిన కమల్‌హాసన్ వేరే సినిమా చేస్తుండటంతో సాగర సంగమం షూటింగ్ ఆలస్యమవుతుండటం, అదే సమయానికి తాను ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయవలసి రావడంతో, అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశానని జయసుధ చెప్పారు.
సినీరంగంలో ప్రముఖులు కె.విశ్వనాథ్ తో తమకున్న అనుబంధాన్ని స్మరించుకొనేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌లో కళాంజలి అనే కార్యక్రమం నిర్వహించారు. దానిలో మాట్లాడుతూ జయసుధ ఈవిషయం బయటపెట్టారు. తాను సాగరసంగమం నుంచి తప్పుకొన్నందుకు కె.విశ్వనాథ్ తనపై చాలా రోజులు అలిగారని, చాలా కాలం తర్వాత మళ్ళీ ఓసారి కలిసినప్పుడు “ఈసారైనా నా సినిమాలో నటిస్తావా?” అని అడిగారని జయసుధ చెప్పారు. ఆయనతో సినిమా చేయలేకపోయానని అదే తనతో ఆయన చివరిసారిగా మాట్లాడిన మాటలని జయసుధ గుర్తుచేసుకొన్నారు.
సాగర సంగమం వంటి గొప్ప చిత్రాన్ని తాను మిస్ చేసుకోనందుకు మొదట చాలా బాధపడ్డానని కానీ ఆ సినిమాలో జయప్రద నటన చూసిన తర్వాత ఆ పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేశారని చాలా సంతోషించానని జయసుధ చెప్పారు.
కె.విశ్వనాథ్ చేసిన అపురూప చిత్రాలలలో నటించలేకపోయినప్పటికీ గతంలో ఆయన తీసిన రెండు కమర్షియల్ చిత్రాలు కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం సినిమాలలో తనకి నటించే అవకాశం లభించిందని జయసుధ చెప్పారు.