రామ్ చరణ్‌ అమెరికాకి ప్రయాణం... ఆస్కార్ తెస్తాడా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ మళ్ళీ అమెరికా బయలుదేరి వెళ్లారు. మార్చి 12వ తేదీన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగబోతోంది. కనుక అమెరికాలో ఆస్కార్ సందడి అప్పుడే మొదలైంది. ఆర్ఆర్ఆర్‌లోని ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్ నామినేష న్స్‌కి షార్ట్ లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్‌ సినిమా కూడా నిలవడంతో రామ్ చరణ్‌ కూడా ఆస్కార్ ముందస్తు కార్యక్రమాలలో పాల్గొనేందుకు అమెరికా బయలుదేరివెళ్ళారు. ముందుగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కార్యక్రమాలలో రామ్ చరణ్‌ పాల్గొనబోతున్నారు. వాటితోపాటు మరికొన్ని ఈవెంట్స్ లో కూడా రామ్ చరణ్‌ పాల్గొంటారు. అవి ముగిసేక మార్చి 12న లాస్ ఏంజలీస్ నగరంలో డల్బీ థియేటర్‌లో జరుగబోయే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనబోతున్నారు. 

ఆర్ఆర్ఆర్‌ పూర్తి చేసిన తర్వాత రామ్ చరణ్‌ శంకర్ దర్శకత్వంలో ఆర్‌సీ15 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆర్‌సీ15లో రామ్ చరణ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి పాత్రకి జోడీగా అంజలి, కొడుకు పాత్రకు జోడీగా కియరా అద్వానీ నటిస్తున్నారు. ఎస్ జే సూర్య, సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు అందించిన కధతో రూపొందున్న ఈ సినిమాకు ‘అధికారి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. 

ఈ సినిమాకి కెమెరా: తిరు, ఆర్‌ రత్నవేలు, సంగీతం: థమన్ అందిస్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌, విశాఖపట్నం, కర్నూలు, మహారాష్ట్ర, పంజాబ్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.