ఫిభ్రవరి 24వ తేదీన ఎన్టీఆర్-కొరటాల సినిమా పూజా కార్యక్రమం వాయిదా పడింది. తారకరత్న మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విచారంలో ఉంది. ముఖ్యంగా తారకరత్నతో జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లకి చాలా అనుబందం ఉంది. కనుక తారకరత్న మృతి వారిరువురికీ పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ పరిస్థితిలో సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రకటించింది.
కళ్యాణ్ రామ్ చేసిన అమిగోస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న జూ.ఎన్టీఆర్ కొరటాలతో సినిమాకి ఫిభ్రవరిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్‌లు ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా విడుదల చేస్తామని చెప్పారు. బహుశః మార్చిలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించి వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు సమాచారం. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి.
ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్‌తో నిర్మించబోతున్న ఈ సినిమాని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ కలిసి నిర్మించబోతున్నారు. ఈ సినిమాకి కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్.