బాహుబలి 1,2 భాగాల తర్వాత ప్రభాస్ సాహొ, రాధేశ్యామ్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడలేకపోయాయి. ఆ తర్వాత ఆదిపురుష్ పూర్తిచేశాడు కానీ దాని ఫస్ట్-లుక్, టీజర్ చూసి జనాలు భయపడటంతో ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ మళ్ళీ మొదటి నుంచి గ్రాఫిక్స్‌తో దానిని చెక్కడం ప్రారంభించాడు. కనుక అది ఎప్పుడు విడుదలవుతుందో తెలీదు. ఈలోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శ్రుతీ హాసన్‌తో కలిసి సలార్ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ –కె, మారుతి దర్శకత్వంలో (రాజా డీలక్స్) మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాడు. ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు కానీ వాటిలో ఏ ఒక్కటీ ఎప్పుడు విడుదలవుతుందో తెలీకపోవడంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర అసహనంగా ఉన్నారు.
ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ అభిమానులకి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ శుభవార్త చెప్పాడు. పాజెక్ట్-కె వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. దాంతోపాటు ఓ అద్భుతమైన రిలీజ్ పోస్టర్ కూడా విడుదల చేశాడు.
ప్రాజెక్ట్-కె సినిమాలో ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్ భామ దీపిక పడుకొనే నటిస్తోంది. దీనిలో బిగ్-బి అమితాబ్ బచ్చన్, దిశా పఠానీ, బ్రహ్మానందం, సల్మాన్ దుల్కర్, సూర్య తదితరులు నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు.