భోళా శంకర్‌ పెద్ద హిట్ అవుతుంది: రాఘవేంద్రరావు

మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య తర్వాత చేస్తున్న చిత్రం భోళా శంకర్‌. తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా వేదాళంకి తెలుగు రీమేక్‌గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా, చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది, ఇటీవలే తమన్నా కూడా వచ్చి చేరింది. కోల్‌కతా నగరానికి సంబందించిన ఓ సెట్ వేసి దానిలో ఓ గ్రూప్ డ్యాన్స్ షూటింగ్‌ చేస్తుండగా, శనివారం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సెట్‌కి వచ్చి అందరినీ పలకరించారు. రాఘవేంద్రరావు రాకతో సెట్‌లో అందరికీ చాలా ఉత్సాహం వచ్చింది. కాసేపు షూటింగ్ నిలిపివేసి అందరూ వచ్చి ఆయనతో మాట్లాడారు.  కోల్‌కతా సెట్ చూసినప్పుడు ‘చూడాలని ఉంది’ సినిమాలో రామ్మా చిలకమ్మా పాట చిత్రీకరణ సన్నివేశం గుర్తుచేసుకొన్నారు. ఆ తర్వాత కాసేపు అందరితో మాట్లాడి కోల్‌కతా సెట్ మంచి సెంటిమెంట్ అని ఆ సినిమాలాగే భోళా శంకర్‌ కూడా పెద్ద  హిట్ అవుతుందని రాఘవేంద్రరావు అందరికీ అభినందనలు తెలిపి వెళ్ళిపోయారు. 

భోళా శంకర్‌ సినిమాలో మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రావు రమేష్, బిత్తిరి సత్తి, ఉత్తేజ్, గెటప్ శ్రీను, రవిశంకర్, ప్రగతి, సత్య అక్కల, రశ్మి గౌతమ్, శ్రీముఖి, తులసి శివమణి, లోబో ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మహతి స్వరసాగర్, ఫోటోగ్రఫీ: డుడ్లీ.