పుస్తకరూపంలో శ్రీదేవి జీవిత కధ... ది లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్!

బాలనటిగా సినీ పరిశ్రమలో ప్రవేశించి వందలాది సినిమాలు చేసిన అలనాటి అందాల నటి శ్రీదేవి జీవిత కధ పుస్తకరూపంలో రాబోతోంది. ఆమె భర్త బోనీ కపూర్ అనుమతితో ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్ కుమార్‌ ‘ది లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్’ అనే పేరుతో శ్రీదేవి జీవిత కధని పుస్తకరూపంలో రచించబోతున్నారు. శ్రీదేవి సెలబ్రేటీ కనుక ఆమె గురించి దాదాపు అంతా ప్రజలకి తెలుసని భావిస్తుంటారు. కానీ ఆమె జీవితంలో ఎవరికీ తెలియని విషయలెన్నో ఉన్నాయి. వాటన్నిటినీ పుస్తకరూపంలో ప్రజలకు, ముఖ్యంగా ఆమె అభిమానులకి అందించాలనే ఆలోచనతో ఈ పనికి పూనుకొన్నానని ధీరజ్ కుమార్‌ తెలిపారు. 

శ్రీదేవి భర్త బోనీకపూర్, ఆయన ఇద్దరి కుమార్తెలు కూడా శ్రీదేవి జీవిత కధ పుస్తకరూపంలో తీసుకురావాలని అనుకొన్నందుకు ఆయనని అభినందించారు.

బాలనటిగా, హీరోయిన్‌గా చేసిన సినిమాలతో శ్రీదేవి ఎంత పేరు సంపాదించారో, ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాలో నడివయస్కురాలైన తల్లిగా అద్భుతంగా నటించి శ్రీదేవి అంటే శ్రీదేవే... ఆమెకి ఎవరూ సాటిరారనిపించుకొన్నారు. ఇప్పుడు ఆ సినిమా చైనాలో ఏకంగా 6,000 థియేటర్లలో ఈనెల 24న విడుదల కాబోతోంది.