టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మృతి

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం... ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫిలిం ఎగ్జిబిటర్ కట్నేని ఉమామహేశ్వర రావు (67) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కన్ను మూశారు. రోజూలాగే నిన్న ఉదయం కూడా కొంతసేపు షటిల్ ఆడిన తర్వాత కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకొంటుండగా గుండెపోటు వచ్చి చనిపోయారు. 

కట్నేని ఉమామహేశ్వర రావు దశాబ్ధాలుగా తెలుగు సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్‌గా అనేక వందల సినిమాలని విడుదల చేశారు. శబ్ధాలయ రికార్డింగ్ స్టూడియోతో ఆయనకి విడదీయరాని అనుబందం ఉన్నందున అందరూ ఆయనని శబ్ధాలయ ఉమామహేశ్వర రావు అని కూడా పిలుస్తుంటారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్‌-కొరటాల కాంబినేషన్‌లో యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై తీస్తున్న సినిమాని ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అటు నిర్మాతలతో ఇటు నటీనటులతో ఆయనకి విడదీయరాని అనుబందం ఉన్నందున ఆయన మరణవార్త తెలుసుకొని చిరంజీవి దంపతులు, నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, మిక్కిలినేని సుధాకర్, జెమిని కిరణ్, జగదీష్ ప్రసాద్, కొర్రపాటి సాయి, గోపి ఆచంట, దామోదర్ ప్రసాద్ తదితరులు వెంటనే హైదరాబాద్‌లో ఆయన నివాసానికి వెళ్ళి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకి సానుభూతి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఈఎస్ఐ శ్మశానవాటికలో ఆయన కుమారుడు అంత్యక్రియలు నిర్వహించారు.