అల్లు అర్జున్‌కి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ

గల్ఫ్ దేశమైన యునైటడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఈ విషయం అల్లు అర్జున్‌ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. యూఏఈకి పర్యాటకం, వ్యాపారాలు, ఐ‌టి కంపెనీలే ప్రధాన ఆదాయవనరు. కనుక ప్రపంచదేశాలని ఆకర్షించేవిదంగా దాని పర్యాటక రంగాన్ని, పాలసీలని రూపొందించుకొంది. దానిలో భాగంగానే బిలియనీర్లకి, సినీ, పారిశ్రామిక, వైద్య, శాస్త్ర, సాంకేతిక తదితర రంగాలకి చెందిన ప్రముఖులకి పదేళ్ళ కాలపరిమితి కలిగిన గోల్డెన్ వీసా మంజూరు చేస్తుంటుంది. దీనికి కనీస అర్హత ఏడాదికి రూ.21 కోట్లు ఆదాయం కలిగి ఉండాలి కనుక సామాన్యులెవరికీ ఈ వీసా లభించదు. 

ఇప్పుడు యూఏఈ ప్రభుత్వం అల్లు అర్జున్‌కి ఈ గోల్డెన్ వీసా జారీ చేసింది. దీంతో అల్లు అర్జున్‌ కుటుంబ సమేతంగా పదేళ్ళపాటు దుబాయ్‌తో సహా యూఏఈలో ఎక్కడైనా నివశించవచ్చు. సొంతంగా ఇళ్ళు, వాహనాలు కొనుక్కోవచ్చు. పెట్టుబడులు పెట్టి సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. భారత్‌ నుంచి ఎన్నిసార్లయినా యూఏఈకి స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు. పదేళ్ళ తర్వాత కావాలనుకొంటే ఈ గోల్డెన్ వీసాని పొడిగించుకోవచ్చు కూడా. ఈ గోల్డెన్ వీసా పొందిన వారికి యూఏఈ పౌరులతో సమానహక్కులు ఉంటాయి. 

ఇప్పటికే భారత్‌ నుంచి పలువురు ప్రముఖులు ఈ గోల్డెన్ వీసా అందుకొన్నారు. వారిలో మొట్ట మొదటగా బాలీవుడ్‌లో నటుడు షారూక్ ఖాన్, ఆ తర్వాత సంజయ్ దత్, సునీల్ శెట్టి, సంజయ్ కపూర్, వరుణ్ ధావన్, కమల్‌ హాసన్‌, సోనూసూద్, రణవీర్ సింగ్,సానియా మీర్జా, ఊర్వశీ రౌతేలా, కాజల్ అగర్వాల్, సల్మాన్ డుల్కర్, మీనా, విజయ్‌ సేతుపతి, విక్రమ్, త్రిష, ఉపాసన రామ్ చరణ్‌ తదితరులు ఎందరో ఈ గోల్డెన్ వీసా కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో అల్లు అర్జున్‌ కూడా చేరారు.