పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా నటించిన 18 పేజెస్ సినిమా గత నెల క్రిస్మస్ పండుగకి థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల చేత మంచి మార్కులే వేయించుకొంది. ఈనెల 25కి నెల రోజులు పూర్తవుతుంది కనుక జనవరి 27వ తేదీ నుంచి ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్, ఆహా ఓటీటీలలో ఒకేసారి విడుదలచేయబోతున్నారు.
ఇంతకీ ఈ సినిమా కధేమిటంటే... సిద్ధూ (నిఖిల్) ఓ యాప్ డెవలపర్. భగ్న ప్రేమికుడు. ఆ బాధలో ఉన్నప్పుడు అతనికి విజయనగరం జిల్లాలోని ఓ పల్లెటూరి అమ్మాయి నందిని (అనుపమ పరమేశ్వరన్) 2019లో వ్రాసుకొన్న ఓ డెయిరీ దొరుకుతుంది. ఆ డైరీ చదివి ఆమె వ్యక్తిత్వం నచ్చి ఆమెని చూడకుండా మళ్ళీ ప్రేమలో పడతాడు సిద్ధూ. ఆ డైరీలో చిరునామాని వెతుక్కొంటూ విజయనగరం వెళ్తాడు సిద్ధూ. కానీ ఆమె ఇంటికి వెళ్ళాక సిద్ధూకి మరో షాక్ తగులుతుంది. ఆమె చనిపోయి రెండేళ్ళయిన్నట్లు తెలుసుకొంటాడు. ఆమె డైరీలో వ్రాసిన విషయాల ఆధారంగా ఆమె ఎలా చనిపోయింది? ఆమె తన తాత సూచన మేరకు ఓ కవర్ తీసుకొని హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది?అనే విషయాలు కనిపెట్టేందుకు సిద్ధూ చేసిన ప్రయత్నాలే మిగిలిన కధాంశం.