అల వైకుంఠ పురములో... హిందీలో షెహజాదా... దించేశారుగా!

త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ చేసిన అల వైకుంఠపురములో సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో చూశాం. దానినే రోహిత్ ధావన్ దర్శకత్వంలో ‘షెహజాదా’ (యవరాజు) పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో అల్లు అర్జున్‌, పూజాహెగ్డే చేసిన పాత్రలని హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ చేస్తున్నారు. ఇక అల వైకుంఠ పురములో అల్లు అర్జున్‌ పెంపుడు తండ్రి పాత్రలో ఇరగదీసిన మురళీశర్మ పాత్రని హిందీలో ప్రముఖ నటుడు పరేష్ రావల్ చేస్తున్నారు.

ఈ సినిమాని అల్లు అరవింద్, భూషణ్ కుమార్, అమన్ గిల్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ ఈరోజు విడుదల చేశారు. దానిలో హిందీ నేటివిటీకి తగ్గట్లుగా సన్నివేశాలు బాగానే మార్చిన్నట్లు స్పష్టం అవుతోంది. అది చాలా అవసరం కూడా. కానీ సన్నివేశాలలో హీరో ఫైట్స్, బాడీ మూమెంట్స్ అన్ని అల్లు అర్జున్‌ చేసినట్లుగానే యదాతదంగా దింపేశారు. అయితే హిందీ ప్రేక్షకులకి ఇది పూర్తిగా కొత్త సినిమాయే కనుక చాలా ఆస్వాదిస్తారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఓసారి చూసుకొని మనదే బాగుందని తృప్తిపడవచ్చు కూడా. ట్రైలర్‌ చూస్తే మీరే అంగీకరిస్తారు. ఈ సినిమా ఫిభ్రవరి 11వ తేదీన విడుదల కాబోతోంది.