తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీనియర్ నటులందరూ మూస కధలతో మూస కమర్షియల్ సినిమాలు తీసుకొంటూ కాలక్షేపం చేస్తుంటే, ఎటువంటి ఒత్తిళ్ళు లేని యువనటీనటులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు చిన్న బడ్జెట్‌లో విలక్షమైన కధాంశాలతో అందరినీ ఆకట్టుకొనే సినిమాలు తీసి మెప్పిస్తున్నారు. అటువంటివారిలో యువనటుడు కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. కొత్త దర్శకుడు కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ‘వినరో భాగ్యము విష్ణు కధ...’ అనే ఆకట్టుకొనే టైటిల్‌తో ఎటువంటి హంగామా లేకుండా ఓ సినిమా పూర్తిచేసి ఫిభ్రవరి 17న విడుదల చేయబోతున్నాడు. ఈ సందర్భంగా ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. ఓ విలన్ గ్యాంగ్ ముందు కూర్చొని హీరో తన కధ చెపుతుండగా సినిమాలో సన్నివేశాలని టీజర్‌లో చూపించడం చాలా బాగుంది. ‘ఈ రోజుల్లో లవ్ లేని స్టోరీ ఎక్కడుంది సార్? ‘లవ్వే ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కద్సార్?’ ‘చిరిగిపోయిన జీన్స్ వేసుకొన్నంత మాత్రన్న నేను నీకు ఆంటీ అయిపోతానా బ్రదర్? అంటూ వచ్చే డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో మురళీ శర్మ డ్యాన్స్, కామెడీ హైలైట్ కాబోతోందని టీజర్ చూస్తే అర్దమవుతుంది.
ఈ సినిమాలో కిరణ్‌కి జోడీగా కశ్మీర పరదేశి నటిస్తోంది. ఇంకా శుభలేఖ సుధాకర్, ప్రవీణ్, పమ్మి సాయి, తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: విశ్వాస్, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ చేస్తున్నారు.