ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి... ప్రజల ముందుకి సమంత!

యశోద సినిమా చేస్తున్నప్పుడు సమంత మయో సైటిస్ అనే వ్యాధి బారినపడి అతికష్టం మీద ఆ సినిమాని పూర్తిచేసారు. ఆమె కష్టానికి  ఫలితంగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఆమె ఎవరికీ కనిపించలేదు. కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియాలో మళ్ళీ కనిపించి, తాను అనుభవిస్తున్న ఈ బాధ, కష్టాలకి ఏకైక ఉపశమనం సినిమాలలో నటించడమే అని చెప్పుకొన్నారు.

ఆమె నటించిన మరో చిత్రం శాకుంతలం ఫిభ్రవరి 17న విడుదల కాబోతోంది. ఆ సినిమా ట్రైలర్‌ని చిత్ర బృందం ఈరోజు హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి తెల్లటి చీరలో దేవకన్యలా దగదగా మెరిసిపోతున్న సమంత హాజరుకావడంతో అభిమానులు చాలా సంతోషించారు. 

ఈ సందర్భంగా శాకుంతలం సినిమా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ, “ఈ సినిమాకి ఒక్కరూ కాదు... ముగ్గురు హీరోలున్నారు. ఒకరు దుష్యంతుడుగా చేసిన దేవ్ మోహన్‌ కాగా మరొకరు సమంత. ఇంకొకరు ఈ సినిమా నిర్మాత దిల్‌రాజు. కానీ ముగ్గురిలో ఈ క్రెడిట్ మొత్తం నేను నిర్మాత దిల్‌రాజుగారికే ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి మంచి సినిమాలు మేము తీయాలంటే వెనుక నుంచి ప్రోత్సహించే దిల్‌రాజు వంటి మంచి టేస్ట్ ఉన్న నిర్మాతలు చాలా అవసరం. ఇప్పటివరకు సినిమాలని చెక్కే దర్శకుడు (రాజమౌళి)ని చూశాము. కానీ దర్శకుడి చేత సినిమాలు చెక్కించే గొప్ప నిర్మాత దిల్‌రాజు మాత్రమే,” అంటూ దర్శకుడు గుణశేఖర్ భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకొంటే సమంత కూడా భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకొన్నారు. 

ఈ సినిమాకి ఏడాదిన్నర పాటు ప్రీ-ప్రొడక్షన్ చేసి కేవలం ఆరు నెలల్లో సినిమా పూర్తిచేశామని చెప్పారు. శాకుంతలం వంటి ఓ పెర్ఫెక్ట్ ఫిలిమ్ అందిస్తున్నామని కనుక ఇది ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నానని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. 

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, “ఈ సినిమా నా జీవితంలోనే చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాను. నేను అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిసి నామీద ఇంత ప్రేమాభిమానాలు చూపిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు. 

(Video courtecy: TV9)