వాల్తేర్ వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కి గ్రీన్ సిగ్నల్‌!

మెగా అభిమానులకు ఓ శుభవార్త! మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్‌ జోడీగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అడ్డంకులు తొలిగిపోయాయి. ఈ నెల 8వ తేదీన విశాఖ బీచ్‌ రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకొన్నప్పటికీ, పోలీసుల సూచన మేరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించబోతున్నట్లు వీరయ్య బృందం ట్విట్టర్‌లో ప్రకటించింది. రేపు అంటే శనివారం వాల్తేర్ వీరయ్య ట్రైలర్‌ విడుదల చేస్తామని, మర్నాడు అంటే ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నట్లు వీర్య్య బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది. వాల్తేర్ వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.  

ఇక వీరయ్య కంటే ఒక రోజు ముందు అంటే జనవరి 12న బాలయ్య వీరసింహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ఒంగోలు పట్టణంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ జరుగబోతోంది. ఈ సందర్భంగావీరసింహారెడ్డి ట్రైలర్‌ కూడా విడుదల కాబోతోంది. కనుక ఈరోజు ఉదయం నుంచే బాలయ్య అభిమానులతో ఒంగోలు పట్టణం చాలా సందడిగా మారింది. 

ఇద్దరు పెద్ద హీరోల సినిమాల ట్రైలర్లు, ప్రీరిలీజ్ ఈవెంట్లు, సినిమాలు అన్నీ ఒక్క రోజు గ్యాప్‌తో వస్తుండటంతో అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ రెండు సినిమాలలో శ్రుతీ హాసనే హీరోయిన్‌గా నటించడం ఓ విశేషమైతే, రెండు సినిమాల నిర్మాణ సంస్థ (మైత్రీ మూవీ మేకర్స్) ఒకటే కావడం మరో విశేషం.