ఇంతవరకు ప్రభాస్ చేసిన సినిమాలన్నీ ఓ ఎత్తు. ఆదిపురుష్, ప్రాజెక్ట్-కె రెండూ మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదిపురుష్ టీజర్, ఫస్ట్-లుక్‌పై వచ్చిన విమర్శలను, వివాదాలను పక్కనపెడితే ప్రభాస్ తొలిసారిగా శ్రీరాముడిగా పౌరాణిక పాత్ర చేస్తున్నాడు. ఆరడగుల ఆజానుబాహువు ప్రభాస్ రాజసం ఎంత గొప్పగా ఉంటుందో బాహుబలి సినిమాలో అందరూ చూశారు. ఇప్పుడు తేజోమయుడైన శ్రీరాముడిగా ఏవిదంగా ఉంటారో చూడబోతున్నాము. కనుక ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయని చెప్పుకోవచ్చు.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్-కె సినిమా కధ తెలుగు ప్రేక్షకులు ఎన్నడూ కనీవినీ ఎరుగనిది. మూడో ప్రపంచయుద్ధం ఈ సినిమా కధాంశం! కనుక ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో ఊహించుకోవచ్చు. అయితే మహానటి వంటి ఓ క్లాసికల్ మూవీ అందించిన నాగ్ అశ్విన్, హాలీవుడ్ స్థాయి సినిమాని తీయగలరా?తీసి ప్రేక్షకులని మెప్పించగలరా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నప్పటికీ, ఒకవేళ మెప్పించగలిగితే, నాగ్ అశ్విన్, ప్రభాస్‌లని మాత్రమే కాదు... తెలుగు సినీ పరిశ్రమని, భారతీయ సినిమాని కూడా ఈ ప్రాజెక్ట్-కె అంతర్జాతీయంగా మరోస్థాయికి వెళ్ళిపోవడం తధ్యం. అందుకే ఆదిపురుష్, ప్రాజెక్ట్-కె సినిమాలు ప్రభాస్ కెరీర్లో మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు.
ఈ ప్రాజెక్ట్-కె సినిమాలో ప్రభాస్‌కి జోడీగా బాలీవుడ్ అందాలభామ దీపిక పడుకొనే నటిస్తోంది. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్-కె బృందం ఈ సినిమాలో ఆమె ఫస్ట్-లుక్ పోస్టర్ని విడుదల చేసింది.
ఈ సినిమాలో బిగ్-బి అమితాబ్ బచ్చన్, దిశా పఠానీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. సల్మాన్ దుల్కర్, సూర్య అతిధి పాత్రలలో చేస్తున్నట్లు సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: డానీ సాంజెక్ లోపెజ్, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.