మైనస్ డిగ్రీల చలిలో మంచులో చీరతో డ్యాన్స్... చాలా కష్టం! శృతి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా జనవరి 13న వస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమాలో ‘నువ్వు శ్రీదేవివైతే...’ అనే పాట షూటింగ్‌లో తాము ఎంత ఇబ్బంది పడ్డామో చిరంజీవి స్వయంగా వాల్తేర్ వీరయ్య రిపోర్టింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్ అంటూ ఓ వీడియో క్లిప్ ద్వారా తెలియజేశారు. మైనస్ డిగ్రీల చలిలో మంచులో డ్యాన్స్ చేస్తుంటే పాదాలు తిమ్మిరెక్కిపోయేవని అయినా అభిమానులని అలరించడం కోసం ఎంత కష్టానికైనా సిద్దమే అంటూ చిరంజీవి ఆ సందేశంలో చెప్పారు. 

సాధారణంగా ఇటువంటి సన్నివేశాలలో హీరోలు కాస్త వెచ్చగా ఉండే డ్రెస్, బూట్లు ధరించే అవకాశం ఉంటుంది కానీ హీరోయిన్లకి ఆ అవకాశం కూడా ఉండదు. వారు మరింత అందంగా కనిపించాలి కనుక పలుచని చీరలో... కాళ్ళకి చెప్పులు మాత్రమే ధరించి ఎంతో ఆనందంగా ఉన్నట్లు డ్యాన్స్ చేయాల్సివస్తుంది. ఈ పాటలో శ్రుతీ హాసన్‌ పరిస్థితి కూడా సరిగ్గా అదే. ఈ పాటలో ఆమె చీర కట్టులో చేసిన డ్యాన్స్ ఎంతో అద్భుతంగా ఉంది. అది చూసి మెగా అభిమానులు మురిసిపోయారు. 

అయితే మైనస్ డిగ్రీల చలిలో మంచులో చీర కట్టుకొని డ్యాన్స్ చేయడానికి తాను ఎంతో శ్రమించాల్సి వచ్చిందని శ్రుతీ హాసన్‌ తెలిపారు. ఆ చలి, మంచులో శరీరం గజగజవణుకుతుంటే, కాళ్ళు చేతులు తిమ్మిరెక్కిపోతున్నా ప్రేక్షకులని మెప్పించడం కోసం అక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో హాయిగా డ్యాన్స్ చేస్తున్నట్లు చేశానని చెప్పారు. చిరంజీవి ధైర్యం చెపుతూ సహకరించబట్టే చేయగలిగానని శ్రుతీ హాసన్‌ చెప్పారు. 

చిరంజీవి యూనిట్ సభ్యులందరినీ కూడా ప్రోత్సహిస్తూ షూటింగ్‌ రెండు రోజులలోనే పూర్తిచేయించారని ఆయన అంత పట్టుదలగా చేయించకపోయుంటే ఆ పాట షూటింగ్ పూర్తి చేయడానికి మరో వారం రోజులైనా పట్టి ఉండేదని యూనిట్ సభ్యులు చెప్పారు. దీంతో ఆ పాట షూటింగ్ కోసం వారెంత కష్టపడ్డారో అర్దమవుతోంది. అందుకే ఆ సాంగ్‌ అంత అద్భుతంగా వచ్చింది. మళ్ళీ ఓ సారి లుక్కేద్దామా?