బాలయ్య కొంటె ప్రశ్నలు.. ప్రభాస్‌ కొంటె జవాబులు... అన్‌స్టాపబుల్‌!

సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ సీనియారిటీ అన్‌స్టాపబుల్‌ షోని రక్తి కట్టించడానికి చాలా ఉపయోగపడుతోందని ప్రభాస్‌తో చేసిన ఎపిసోడ్‌ చూస్తే అర్దమవుతుంది. ఇండస్ట్రీలో బాలయ్య చాలా సీనియర్ కనుక ఎవరినైనా చాలా చనువుగా, నిర్భయంగా ప్రశ్నించగలుగుతున్నారు. ఆట పట్టించగలుగుతున్నారు. 

ప్రభాస్‌తో చేసిన ఎపిసోడ్‌లో బాలయ్య “ఆదిపురుష్‌ సినిమాలో జానకిగా నటించిన కృతి సనన్‌తో ప్రేమలో పడ్డావని సోషల్ మీడియా గుప్పుమంటోంది... నీ సమాధానం ఏంటి?” అని నిలదీస్తే, ప్రభాస్‌ కూడా అంతే సరదాగా “ఊరుకోండి సార్... ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు పుకార్లు పుట్టుకొస్తాయి. అయినా మేడం కూడా చెప్పారు కదా?” అని అన్నాడు. 

వెంటనే “మేడం చెప్పారా... చెప్పమన్నారా?” అంటూ అడిగేసరికి ప్రభాస్‌ కంగుతిన్నట్లు ఫేస్‌ పెట్టి “లేదు సార్... మేడం చెప్పారు,” అంటాడు. 

అప్పుడు బాలకృష్ణ “అయినా ఈ మేడం మేడం ఏమిటి? ఎవరు ఆ మేడం? నేను మా ఇంట్లో నా భార్యని కూడా వసు మేడం అనే పిలుస్తుంటాను,” అని అనేసరికి ప్రభాస్‌కి ఏం సమాధానం చెప్పాలో పాలుపోలేదు. మేడం అంటే కృతి సనన్ అని చెప్తే వేరే అర్దం వస్తుందని సినిమాలో జానకి అని చెప్పడంతో అందరూ మనసారా నవ్వుకొన్నారు. 

ఆ తర్వాత ప్రభాస్‌ కూడా “అయినా మీరు అనేకమంది హీరోయిన్లతో అనేక సినిమాలు చేశారు కద్సార్.. మీకూ ఇవన్నీ తెలుసు కదా? మీ అదృష్టం ఏమిటంటే అప్పుడు సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఉంది. ఒకవేళ అప్పుడే సోషల్ మీడియా ఉండి ఉంటే మీ గురించి కూడా ఇటువంటివి వచ్చి ఉండేవే,” అంటూ ప్రభాస్‌ అనేసరికి అందరూ హాయిగా నవ్వుకొన్నారు.