టాలీవుడ్‌లో మరో విషాదం... నటుడు వల్లభనేని జనార్ధన్ మృతి

ఈ ఒక్క ఏడాదిలోనే అలనాటి మేటి నటులు కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు చనిపోయారు. ఇంతటితోనైనా ఈ విషాదం ముగుస్తుందనుకొంటే, ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్ధన్ (63) అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఈరోజు తీవ్ర అస్వస్థతకి గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని హైదరాబాద్‌ అపోలో హాస్పిటల్‌లో చేర్చారు. కానీ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలో తొలిసారిగా పోలీస్ ఆఫీసరుగా వల్లభనేని జనార్ధన్ నటించారు. ఆ సినిమాకి ఆయన మావగారు విజయబాపినీడే దర్శకత్వం వహించారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత వందకి పైగా సినిమాలలో అనేక సహాయ పాత్రలలో చేసి వల్లభనేని జనార్ధన్ ప్రేక్షకులని మెప్పించారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన లక్ష్మీ నరసింహ, నాగార్జున నటించిన వారసుడు, వెంకటేష్ చిత్రం సూర్యా ఐపీఎస్ వంటి అనేక సినిమాలలో వల్లభనేని జనార్ధన్ నటించారు. 

వల్లభనేని జనార్ధన్ భార్య (విజయబాపినీడు మూడవ కుమార్తె) పేరు లళినీ చౌదరి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వారిలో మొదటి కుమార్తె శ్వేత చిన్నతనంలోనే చనిపోయింది. రెండో కుమార్తె అభినయ ఫ్యాషన్ డిజైనర్. కుమారుడు అవినాష్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. వల్లభనేని జనార్ధన్ ఆకస్మిక మృతిపట్ల చిత్ర పరిశ్రమలో ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.