అవును... వీరయ్య రొటీన్ మాస్ మసాలా చిత్రమే: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్ జంటగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ మంగళవారంతో పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం వేసిన సెట్‌లోనే మంగళవారం సాయంత్రం ఈ చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. దానిలో విలేఖరులు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడగగా చిరంజీవి అంతే ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. 


“ఈ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా మీరు ఓ సినిమా కోసం ఇంకా ఇంత కష్టపడాలా?”అనే ప్రశ్నకి సమాధానం చెపుతూ, “ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మంచి సినిమాలు,మంచి పాత్రలు చేయాలని మనం ఎలా ఆకలిగా ఉంటామో వంద, రెండొందలు సినిమాలు చేసిన తర్వాత అదే ఆకలితో ఉండాలి. అదే కమిట్‌మెంట్‌తో పనిచేయాలి. అప్పుడే మన వృత్తికి న్యాయం చేయగలం. ఒకవేళ కష్టపడలేమనుకొంటే అదే రోజున రిటైర్ అయిపోవాలని నేను గట్టిగా నమ్ముతాను. అందుకే ప్రతీ సినిమాకి నేను కష్టపడుతూనే ఉంటాను. అభిమానుల సంతోషం కోసం ఎంత కష్టపడటానికైనా నేను ఎప్పుడూ సిద్దమే. చిరంజీవి-శ్రీదేవి పాట షూట్ చేస్తునప్పుడు మంచుకి కాళ్ళు తిమ్మెర్లు ఎక్కిపోయేవి. అయినా నా అభిమానుల సంతోషం కోసం ఆ బాధని చిర్నవ్వు వెనుక దాచేసి డ్యాన్స్ చేశాము,” అని చెప్పారు. 

“ఇది రొటీన్ మాస్ మసాలా సినిమాయేనా? ఏదో వెరైటీ లేకపోతే ప్రేక్షకులు కూడా చూడటం లేదిప్పుడు. దీనిలో ఏముంది ప్రత్యేకత?” అని మరో విలేఖరి ప్రశ్నకి చిరంజీవి “యస్. ఇది రోటీన్ మాస్ మసాలా సినిమాయే. రాసి పెట్టుకోండి. కానీ ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించనంత వైవిద్యమైన ఎమ్మోషన్స్ ఉండబోతున్నాయి. అది చూసి ప్రేక్షకులు చాలా థ్రిల్ అవుతారు. దర్శకుడు బాబీ నా వీరాభిమాని. కనుక అభిమానులు నా నుంచి ఏం కోరుకొంటారో సరిగ్గా అలాగే తెరకెక్కించాడు. ఈ సినిమాలో నా పాత్రని బాబీ చాలా అద్భుతంగా మలిచాడు,” అని చిరంజీవి చెప్పారు. 

వాల్తేర్ వీరయ్య ఓ రోటీన్ మాస్ మసాలా సినిమా అని చిరంజీవి స్వయంగా ముందే చెప్పేయడంతో అభిమానులు సంతోశించవచ్చేమో కానీ నిర్మాతలను టెన్షన్ పెట్టిన్నట్లే ఉన్నారు. సినిమాలో కొత్తదనం ఏమీ లేదని తెలిస్తే, ‘ఈ మాత్రం దానికి డబ్బు ఖర్చుపెట్టుకొని థియేటర్లకి వెళ్ళి చూడటం దేనికీ? ఎలాగూ నెలరోజుల్లోగా ఓటీటీలో వచ్చేస్తుందిగా! అని చాలామంది ఆగిపోతే నిర్మాతలకి చాలా నష్టం కలుగుతుంది.   

వాల్తేర్ వీరయ్యకి ఒక్క రోజు ముందు అంటే జనవరి 12న బాలకృష్ణ, శ్రుతీ హాసన్ జంటగా చేస్తున్న వీర సింహారెడ్డి, కోలీవుడ్‌ హీరోలు విజయ్‌, అజిత్ నటించిన వారసుడు, తెగింపు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. కనుక నాలుగు సినిమాలు ఒకదానికి మరొకటి పోటీగా నిలుస్తాయి. కనుక సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ నాలుగు సినిమాలలో ఏది గెలుస్తుందో... ఏది ఓటీటీలోకి షిఫ్ట్ అయిపోతుందో చూడాల్సిందే.