
ప్రముఖ తెలుగు సినీ నటుడు చలపతి రావు (78) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. మొన్న.. శుక్రవారం ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ చనిపోగా నిన్ననే ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతి పట్ల చలపతి రావు కూడా సంతాపం తెలిపారు. కానీ ఒక్కరోజు వ్యవధిలో ఆయన కూడా మృతి చెందారు.
చలపతి రావు 1944, మే 8వ తేదీన కృష్ణాజిల్లా బల్లిపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన 1966లో విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, జూ.ఎన్టీఆర్ వంటి ప్రముఖ నటులందరి సినిమాలలో విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించారు.
యమగోల, యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, భలే కృష్ణుడు, జస్టిస్ చౌదరి, నిన్నే పెళ్ళాడుతా, నువ్వే కావాలి, సింహాద్రి, బొమ్మరిల్లు, అరుంధతి, సింహా, దమ్ము, లెజెండ్ తదితర 600కి పైగా చిత్రాలలో చలపతి రావు నటించారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్ళంటే నూరేళ్ళ పంట తదితర సినిమాలకి చలపతి రావు దర్శకత్వం వహించారు. చలపతి రావు చివరిగా 2021లో విడుదలైన బంగార్రాజు సినిమాలో నటించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో సినిమాలలో నటించడం మానుకొన్నారు.
చలపతి రావుకి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వారిలో కుమారుడు రవిబాబు నటుడు, దర్శకుడు, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకొన్నారు. కైకాల సత్యనారాయణ మృతితో తీవ్ర విషాదంలో ఉన్న తెలుగు సినీ అభిమానులు, సినీ పరిశ్రమ చలపతి రావు చనిపోయారనే వార్తను జీర్ణించుకోవడం కష్టమే. ఆయన మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.