భారత్ తరపున ఆస్కార్ అవార్డులకి ఆర్ఆర్ఆర్ సినిమాని పంపించకపోయినా ఆ సినిమా దర్శకనిర్మాతలు తమ చిత్రాన్ని వేర్వేరు విభాగాలలో నామినేషన్స్ కోసం పరిశీలించవలసిందిగా కోరుతూ నేరుగా ఆస్కార్ అవార్డుల కమిటీకి దరఖాస్తు చేసుకొన్న సంగతి తెలిసిందే. ఆ కమిటీ తాజాగా నాలుగు భారతీయ చిత్రాలను నామినేషన్స్ కోసం ఎంపిక చేసిన ఓ జాబితాని ప్రకటించింది.
వాటిలో ఆర్ఆర్ఆర్ కూడా ఉండటం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకి చాలా సంతోషం కలిగిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చాలా పాపులర్ అయిన ‘నాటు నాటు’ పాటని ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఎంపిక చేసింది.
ఇది కాక భారత్ తరపున అధికారికంగా నామినేట్ అయిన గుజరాతీ చిత్రం చెల్లో షో (ది లాస్ట్ షో)ని ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ఎంపికైంది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో “ఆల్ దట్ బ్రీత్స్”, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో “ఎలిఫెంట్ విష్పరర్” ఎంపికయ్యాయి.
ఈ జాబితాలో ఇంకా వివిద దేశాలకు చెందిన ఎంపికైన చిత్రాలు కూడా ఉంటాయి కనుక వాటన్నిటిపై జనవరి 12 నుంచి 17వరకు ఓటింగ్ నిర్వహించి, వాటిలో ఎన్నికైన వాటిని ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపిక చేస్తారు. మళ్ళీ వాటిలో నుంచి ఆస్కార్ అవార్డ్స్ కమిటీ సభ్యులు వివిద విభాగాలలో అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసి మార్చి 12న జరిగే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రకటించి అవార్డులు అందజేస్తారు.
ఆస్కార్ నామినేషన్స్ ఆర్ఆర్ఆర్ సినిమాని పలు విభాగాలలో దరఖాస్తు చేసుకోగా తాజాగా విడుదల చేసిన జాబితాలో ఒక్క ‘నాటు నాటు’ పాటనే ఎంపిక చేయడం చాలా నిరాశ కలిగిస్తుంది. అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియ ఇంకా ఇప్పుడే మొదలైంది కనుక అది పూర్తయ్యేలోగా ఆర్ఆర్ఆర్ సినిమాకి వేరే విభాగాలలో ఆస్కార్ అవార్డులు లభిస్తాయో లేదో తెలియాలంటే మార్చి 12 వరకు ఓపికగా ఎదురు చూడాల్సిందే.