కమల్‌హాసన్‌కి స్వల్ప అస్వస్థత

ప్రముఖ తమిళ నటుడు కమల్‌హాసన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యి బుదవారం సాయంత్రం చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్‌లో చేరారు. జ్వరంతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స చేసి ఈరోజు ఉదయం హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకి సూచించారు. 

కమల్‌హాసన్‌-శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమా షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మరోపక్క బిగ్ బాస్ (తమిళ్) హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. కనుక విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. కొన్ని నెలల క్రితం కమల్‌హాసన్‌ కరోనా బారిన పడటంతో ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బుదవారం ఉదయం హైదరాబాద్‌ వచ్చి తన గురువు, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ ఆశీర్వాదం తీసుకొని చెన్నై తిరిగివెళ్ళారు. చెన్నై చేరుకొనేసరికి జ్వరం రావడంతో నేరుగా హాస్పిటల్‌లో చేరిపోయారు. చికిత్స అనంతరం ఈరోజు ఉదయం ఇంటికి చేరుకొన్నారు. కమల్‌హాసన్‌ హాస్పిటల్‌లో చేరారని తెలియగానే ఆయన అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, అందుకే హాస్పిటల్‌ నుంచి వెంటనే డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు.