అప్పుడు వద్దన్నాడు... ఇప్పుడు అతనే తెచ్చి ఇచ్చాడు: సమంత

సమంత ప్రధాన పాత్రలో వచ్చిన యశోద సినిమా ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకొంది. మొదటి మూడు రోజులలలో భారత్‌లో అన్ని భాషలలో కలిపి రూ.11.63 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లు కలక్షన్స్‌ వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ఇంతకంటే చాలా భారీ స్థాయిలో కలక్షన్స్‌ ఉంటాయని ఆశించడం వలన ఇవి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ, ఓ హీరోయిన్‌ ఓరియంటడ్ మూవీకి ఈ స్థాయిలో కలక్షన్స్‌ రాబట్టడం మామూలు విషయమేమీ కాదని సినీ మేధావులే ఒప్పుకొంటున్నారు. 

ఇక ఈ సినిమాలో సమంతకు పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్న జునైద్‌ షేక్‌ని ప్రేమతో కౌగలించుకొన్న ఓ ఫోటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ఓ భావోద్వేగమైన సందేశం పెట్టారు. 

“సినిమా షూటింగ్ జరుగుతున్ననాళ్లు జునైద్‌ నాకు ఎంతో ఇష్టమైన జిలేబీ తినేందుకు అనుమతించలేదు. నాకు జిలేబి తినేందుకు అర్హత లేదన్నట్లు మాట్లాడేవాడు. కానీ యశోద సినిమా విజయవంతం అవడంతో ఇవాళ్ళ ఆయనే స్వయంగా జిలేబీ తీసుకువచ్చి నాకు తినిపించాడు. గత కొన్ని నెలలుగా నా జీవితంలోనే అత్యల్ప స్థాయిలో ఉన్నప్పుడు, నేను అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు, నా కన్నీళ్ళను, చాలా హై డోసులో స్టెర్రాయిడ్ థెరపీ తీసుకొంటున్నప్పుడు నన్ను అత్యంత సమీపం నుంచి చూసిన వ్యక్తి జువైద్‌. కానీ అతను నన్ను వెనక్కు తగ్గనీయలేదు... ఓడిపోనీయలేదు.... ఓడిపోనీయడు కూడా! ధాంక్ యూ,” అని భావోద్వేగమైన సందేశం పెట్టారు.