యంగ్ హీరో నాగ శౌర్య ఈరోజు హైదరాబాద్‌లో సినిమా షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు హటాత్తుగా సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ సినిమాకు తగ్గట్లుగా శరీరాన్ని మలుచుకోవడానికి విపరీతంగా శ్రమిస్తుండటంతో నీరసం వచ్చి సొమ్మసిల్లిపడిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే యూనిట్ సభ్యులు నాగశౌర్యను గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి కలిసి ప్రొడక్షన్ నంబర్: 1గా తీస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. నాగశౌర్య, బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని ఈ నెల 20వ తేదీ ఉదయం 11.25 గంటలకు బెంగళూరులో వివాహం చేసుకోబోతున్నాడు. పెళ్ళికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్నప్పుడు నాగశౌర్య సొమ్మసిల్లి పడిపోయి హాస్పిటల్లో చేరడంతో ఇరు కుటుంబాలవారు ఆందోళన చెందుతున్నారు.
ఇది నాగశౌర్యకి 24వ చిత్రం. దీని తర్వాత నారీనారీ నడుమ మురారి, పోలీసు వారి హెచ్చరిక సినిమాలు చేయబోతున్నాడు.