
రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. గత కొంతకాలంగా దానికి సీక్వెల్ (రెండో భాగం) రాబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ, “ఆర్ఆర్ఆర్‌కి మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ కధ అందించారు. దానికి సీక్వెల్ తీస్తే బాగుంటుందని ఆయన అన్నారు. దానిపై ఇటీవలే మేమిద్దరం చర్చించాము. ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ అయ్యింది... దానికి వందల కోట్లు కలక్షన్స్ వచ్చాయని గాక అదొక అద్భుతమైన కాన్సెప్ట్ ఉన్న కధ కనుక దానికి సీక్వెల్ తీస్తే బాగుంటుందని మేమిద్దరం అనుకొన్నాము. ముఖ్యంగా నా ప్రియ సోదరులు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో నేను మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం కలుగుతుందని నేను చాలా ఆశపడుతున్నాను. దీనిపై మా నాన్నగారు ఆలోచిస్తున్నారు. ఆయన తలుచుకొన్నారంటే తప్పకుండా కధ తయారుచేయగలరనే నమ్మకం నాకుంది. చూద్దాం... ఏం జరుగుతుందో?” అని అన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ముగింపులో అల్లూరి సీతారామరాజు (రామ్ చరణ్), కుమురం భీమ్ (జూ.ఎన్టీఆర్) బ్రిటిష్ సైన్యంతో చేసిన ఓ క్లైమాక్స్ ఫైట్ చేసి తప్పించుకొనట్లు చూపారు తప్ప బ్రిటిష్ వారు దేశం విడిచివెళ్ళిపోన్నట్లు చూపలేదు. కనుక ఆర్ఆర్ఆర్-2 మొదలుపెట్టడానికి కావలసినంత ముడిసరుకు ఉన్నట్లే లెక్క. ఆ తర్వాత వారిరువురూ ఏవిదంగా బ్రిటిష్ వారితో పోరాడారో సినిమాగా తీయవచ్చు. లేదా కుమురుం భీమ్ తెలంగాణలో చేసిన పోరాటాలను, అలాగే అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడిగా చేసిన పోరాటాలను రెండు వేర్వేరు కధలను ఒకే సినిమాగా చూపవచ్చు. మరి విజయేంద్ర ప్రసాద్ ఈసారి ఆర్ఆర్ఆర్-2కి ఎటువంటి కధ అందిస్తారో దాన్ని రాజమౌళి ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి. రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. బహుశః అది పూర్తయిన తర్వాత ఆర్ఆర్ఆర్-2 మొదలుపెడతారేమో?అంటే మరో రెండు మూడేళ్ళ తర్వాతే అన్నమాట!