కేవలం కామెడీ మాత్రమే చేయగలదనుకొన్న అల్లరి నరేష్ గమ్యం, నాంది, ప్రాణం వంటి సీరియస్ సినిమాలలో తాను ఏమిటో చూపించాడు. అయితే చాలా కాలంగా నరేష్‌కి మంచి హిట్ పడలేదు. ఇప్పుడు మరో సీరియస్ సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అల్లరి నరేష్‌కిది 59వ సినిమా. దీనికి ఏఆర్ మోహన్ దర్శకుడు. ఈ సినిమాలో చాలా విభిన్నమైన పాత్ర ఎన్నికలలో పోలింగ్ అధికారిగా నటించాడు.
దట్టమైన అడవుల నడుమ కనీస సౌకర్యాలు కూడా లేని మారుమూల ప్రాంతమైన మారేడుమిల్లిలో పోలింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు పోలింగ్ అధికారిగా అల్లరి నరేష్ వెళ్లినప్పుడు, అక్కడి పరిస్థితులు ఏవిదంగా ఉన్నాయి? రాజకీయనాయకులు ఏవిదంగా వ్యవహరిస్తుంటారు? ఓట్లు వేయించేందుకు గ్రామీణులను ఏవిధంగా ప్రలోభలకు గురిచేస్తారు? అప్పుడు అల్లరి నరేష్ గ్రామీణులతో ఎలా ఓట్లు వేయిస్తారు? స్థానిక రాజకీయ నాయకుడు (విలన్) సృష్టించిన సమస్యల నుంచి అల్లరి నరేష్ ఏవిదంగా బయటపడతాడు? అనేది ఈ సినిమా ప్రధాన కధాంశం. ఈ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది. ట్రైలర్ చూస్తే సీరియస్ సినిమా అని అర్దమవుతూనే ఉంది.
జీ స్టూడియోస్, హాస్య మూవీస్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్‌భవన్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమా నవంబర్ 25వ తేదీన విడుదల కాబోతోంది.