కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి కొత్త సినిమా టైటిల్ వాక్సిన్ వార్

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు దాని తర్వాత వివేక్ అగ్నిహోత్రి మరో కొత్త సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. ఆ సినిమా పేరు ‘ది వాక్సిన్ వార్’ అని తెలిపారు. 

కరోనా, ఆ తర్వాత లాక్‌డౌన్‌ సమయంలో దేశ ప్రజలు ఏవిదంగా నానాబాధలు పడ్డారు... వాక్సిన్ కోసం ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు తదితర అంశాల చుట్టూ అల్లుకొన్న కధే ఈ ‘ది వాక్సిన్ వార్’ సినిమా అని చెప్పారు. కరోనా, లాక్‌డౌన్‌ కధాంశాలుగా ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయని కానీ తాను వేరే కోణంలో నుంచి చూపబోతున్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. 

కరోనా వాక్సిన్‌తో లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న కొన్ని విదేశీ కంపెనీలు, భారతీయ కంపెనీలు తయారుచేసిన అత్యుత్తమ వాక్సిన్లను విడుదల కాకుండా ఏవిదంగా అడ్డుపడ్డాయి, విడుదలైన తర్వాత వాటిని ప్రపంచ మార్కెట్లో అమ్ముకోనీయకుండా ఏవిదంగా అడ్డుపడ్డాయి, అలాగే కరోనా వాక్సిన్‌పై భారత్‌లో కొన్ని రాజకీయ పార్టీలు ఎటువంటి నీచరాజకీయాలు చేశాయి వంటి అంశాలను కూడా ది వాక్సిన్ వార్ సినిమాలో ప్రస్తావించనున్నారు.      

ఐయామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్ పతాకంపై పల్లవి జోషి నిర్మించబోతున్న ఈ సినిమాను కశ్మీర్ ఫైల్స్ సినిమాని తీసిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పైనే విడుదల చేయబోతున్నారు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా ఈ సినిమాను 11 భారతీయ భాషల్లో వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.