విశ్వక్‌... ఎంటిది తప్పు కదూ? తమ్మారెడ్డి

సీనియర్ నటుడు, దర్శకుడు అర్జున్, యువనటుడు విశ్వక్‌  సేన్‌ మద్య ఏర్పడిన వివాదంపై ఇండస్ట్రీలో అందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఇటు నటీనటులు, అటు దర్శకనిర్మాతలు కూడా తరచూ ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ ఎవరూ బయటకి మాట్లాడటం లేదు. ముక్కుసూటిగా మాట్లాడే ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం ఈ వ్యవహారంపై వెంటనే స్పందించారు.

 “ఒక సినిమాకు ఒప్పుకొనే ముందే కధ, స్క్రిప్ట్ వంటి అన్ని అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ దర్శకనిర్మాతలు-నటీనటులలో ఎవరికైనా నచ్చకపోతే ముందే మానుకోవాలి. కానీ ఒకసారి అగ్రిమెంట్ చేసుకొని సినిమా మొదలుపెట్టిన తర్వాత మద్యలో కధ బాగోలేదనో, డైలాగ్స్, పాటలు, మ్యూజిక్ లేదా మరొకటి బాగోలేదని షూటింగ్‌కి వెళ్లకుండా మానేయడం సరికాదు. అర్జున్ దర్శకత్వంలో అనేక సూపర్ హిట్ సినిమాలు అందించారు. అయినప్పటికీ ఆయన పనితీరు, ఆలోచనలు ‘అవుట్ డేటడ్’ అని విశ్వక్‌ భావించినట్లయితే సినిమా ఒప్పుకోకూడదు. కానీ ఒప్పుకొన్నాడు కనుక తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. 

ఆనాడు ఎన్టీఆర్‌గారు, తర్వాత ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణగారు ఇండస్ట్రీలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ, ఒక్కసారి వారు సినిమాకు చేయడానికి ఒప్పుకొంటే ఇక దర్శకుడు ఎలా చెపితే అలా చేసుకుపోతారు తప్ప దర్శకుడి పనిలో వేలుపెట్టరు. ప్రశ్నించరు. ఉదయం 6 గంటలకి షూటింగ్‌ అంటే ఓ గంట ముందే వచ్చేసేవారు తప్ప ఏనాడూ ఆలస్యంగా రాలేదు. నేటి యువతరం నటీనటులలో ఆ క్రమశిక్షణే లోపించిందని నేను భావిస్తున్నాను. 

విశ్వక్‌ షూటింగ్‌కి వెళ్ళకుండా దర్శకనిర్మాతలకు నష్టం కలిగించడమే కాకుండా, దర్శక నిర్మాతలని అవమానించినట్లే భావించవచ్చు. ఇప్పటి యువనటులు ప్రతీ విషయంలో వేలుపెడుతూ దర్శకనిర్మాతలనీ చాలా ఇబ్బంది పెడుతుంటారు. తమకు అన్నీ తెలుసనుకొని వారు చేసే ఇటువంటి పనుల వలన చివరికి సినిమా చెడిపోయి అందరూ నష్టపోవలసి వస్తోంది. అలాగే సినీ ఫంక్షన్స్‌లో కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ, మాట్లాడుతూ ప్రేక్షకులను, దర్శక నిర్మాతలను కూడా ఇబ్బంది పెడుతుంటారు. 

విశ్వక్‌తో తాను ఎదుర్కొన్న సమస్యల గురించి అర్జున్ సర్జా ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పడం మంచిదే అని నేను భావిస్తున్నాను. అప్పుడే ఇటువంటి సమస్యలు అందరికీ తెలుస్తాయి. అప్పుడే వారిలో మార్పు లేదా సమస్యలకి పరిష్కారం లభిస్తుందని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.