సినీ పరిశ్రమలో నటుడిగా అవకాశం రావడం, దాంతో గుర్తింపు తెచ్చుకోవడం రెండూ చాలా కష్టమే. అన్నీ కలిసివస్తే తప్ప ఎవరూ సినీ పరిశ్రమలో నిలబడలేరు. అటువంటిది ఇప్పుడిప్పుడే నిలదొక్కుకొంటున్న విశ్వక్ సేన్, ఓ సినిమా చేస్తూ సగంలో వదిలేసి మద్యలో వెళ్ళిపోతే? అదీ... దక్షిణాది సినీ పరిశ్రమలో సేనియర్ నటుడు అర్జున్ స్వీయ దర్శకత్వంలో తన కుమార్తె ఐశ్వర్యను హీరోయిన్‌గా పెట్టి నిర్మిస్తున్న సినిమా అయితే?
విశ్వక్ సేన్, ఐశ్వర్య జంటగా అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమాను జూన్ 23న మొదలుపెట్టగా దానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఆ తర్వాత చకచకా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేశారు. త్వరలో మూడో షెడ్యూల్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసుకొంటుంటే విశ్వక్ సేన్ ఆ సినిమా నుంచి తప్పుకొంటునట్లు ప్రకటించాడని తెలుస్తోంది.
అగ్రిమెంట్ ప్రకారం సినిమా పూర్తి చేయకుండా, చెప్పపెట్టకుండా మద్యలో సినిమా విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు అర్జున్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే విశ్వక్ సేన్, అర్జున్ ఈ వార్తలపై ఇంకా స్పందించవలసి ఉంది.
ఈ ఏడాది రిలీజ్ అయిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో విశ్వక్ సేన్ నటించిన హిట్ కొట్టాడు. ఇటీవల విడుదలైన ఓరి దేవుడా సినిమా కూడా బాగానే ఆడుతోంది. ఇప్పుడు అర్జున్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కాకుండా మరో మూడు సినిమాలు చేయబోతున్నాడు. అందులో దాస్ కా దమ్‌కీ అనే సినిమాకు విశ్వక్ సేన్ దర్శకత్వం చేస్తున్నట్లు తెలుస్తోంది.