సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వివాదంలో చిక్కుకొన్నాడు. ఇటీవల ఆయన విడుదల చేసిన ‘ఓ పరి’ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బంలో అసభ్యకరమైన డ్యాన్సులకు హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని జోడించినందుకు నటి కరాటే కళ్యాణి, కొన్ని హిందూ సంఘాలు ఆయనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హిందువులు ఎంతో పవిత్రంగా జపించే హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ఐటెమ్ సాంగ్‌లో చేర్చి దేవిశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడని వారు ఫిర్యాదు చేశారు. కనుక ఆ మ్యూజిక్ ఆల్బంపై తక్షణం నిషేదం విధించి దేవిశ్రీ ప్రసాద్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయనిపుణులని సంప్రదించిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇంకా దీనిపై స్పందించవలసి ఉంది. అయితే తెలుగు సినిమాలు, నాటకాలలో చాలా కాలంగానే హిందూ దేవతలను చులకనగా చూపిస్తుంటారు. అనేక సినిమాలలో హిందూ దేవుళ్ళను కామెడీ కోసం వాడుకోవడం అందరికీ తెలుసు. కనుక ఇటువంటి ఘటనలు ఇప్పుడే ప్రారంభం కాలేదు. ఇప్పట్లో ముగిసేవి కూడా కావు. కనుక దేవిశ్రీ ప్రసాద్ ఆ జాబితాలో ఒకరని సరిపెట్టుకోక తప్పదు.