మరో పక్కా హిట్‌తో అడవి శేష్?

శైలేశ్ కొలను దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా రూపొందిన హిట్-2 సినిమా డిసెంబర్‌ 2న విడుదల కాబోతోంది. శైలేశ్ కొలను దర్శకత్వంలోనే సత్యదేవ్ హీరోగా చేసిన హిట్ సినిమాకి సీక్వెల్‌గా హిట్-2 సెకండ్ కేస్ అనే సబ్ టైటిల్‌తో సిద్దం అవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో అడవి శేష్కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇంకా తనికెళ్ళ భరణి, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

కొన్ని పోలీసు కేసులను కధాంశాలుగా ఎంచుకొని ‘హిట్ యూనివర్స్’ అనే పేరుతో వరుసగా సినిమాలు తీస్తున్నట్లు దర్శకుడు శైలేశ్ కొలను చెప్పారు. ఈవిదంగా హిట్ యూనివర్స్ సిరీస్‌లో భాగంగా మరికొన్ని సినిమాలు తీస్తానని చెప్పారు. హిట్ సినిమాలలో వేర్వేరు రాష్ట్రాలలో పనిచేస్తున్న పోలీసు ఆఫీసర్లు ఓ పెద్ద కేసును చేధించడానికి కలిసి పనిచేసినట్లు చూపబోతున్నామని దర్శకుడు శైలేశ్ కొలను చెప్పారు.

గతంలో ఇటువంటి ప్రయోగాలు జరిగినా అవన్నీ ఒకే సినిమాలో వేర్వేరు కధలుగా చూపిస్తూ చివరిలో అందరినీ కలుపుతుండేవారు. కానీ ఈవిదంగా కొన్ని ‘హిట్ సినిమాలు’ తీసి వాటన్నిటినీ కలపాలనుకోవడం అద్భుతమైన ఆలోచనే అని చెప్పవచ్చు. ఇప్పటికే తన సత్తా చాటుకొన్న దర్శకుడు శైలేశ్ కొలను దీంతో మరోసారి అది నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇక అడవి శేష్‌ మేజర్ చిత్రంతో జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. కానీ ఇప్పుడు దీంతో తెలుగు ప్రజలకే పరిమితం కాబోతున్నాడు. వీలైతే హిందీతో సహా మరికొన్ని భాషలలో సినిమాను డబ్ చేసి విడుదల చేస్తామని చెప్పారు. 

ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా గురువారం హైదరాబాద్‌, ఏఏంబీ మాల్‌లో హిట్-2 టీజర్‌ విడుదల చేశారు. టీజర్‌ చాలా ఆకట్టుకొనేలా తీశారు. పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్న రావు రమేష్, అడవి శేష్‌ మద్య జరిగిన సంభాషణ, మీడియాతో అడవి శేష్‌ ఇంటరాక్షన్, క్రైమ్ సీన్స్ వంటివి చాలా చక్కగా చూపించారు. వాటిని ప్రజంట్ చేసిన తీరు చూస్తే ఈ సెకండ్ కేస్ కూడా సూపర్ ‘హిట్’ అవడం ఖాయంగానే ఉంది. 

ఈ సినిమాకు కెమెరా: మణికందన్, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: జాన్ స్టీవర్ట్ ఏడూరి అందిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిరినేని దీనిని వాల్ పోస్టర్‌ను సినిమా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.