నెట్‌ఫ్లిక్స్‌లోకి గాడ్ ఫాదర్‌... వచ్చేస్తున్నాడు

మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్‌ సినిమా గత నెల దసరా పండుగకు థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో సుమారు రూ.160 కోట్లు కలక్షన్స్‌ వసూలు చేసినట్లు సమాచారం. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్‌ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వచ్చిన గాడ్ ఫాదర్‌ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలలో నటించారు. ఇప్పుడు ఈ సిమిమా ఈనెల 19వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. ఈ విషయం నెట్‌ఫ్లిక్స్‌లో సంస్థ స్వయంగా తెలియజేసింది. గాడ్ ఫాదర్‌ కోసం ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులు మరో రెండు వారాలు ఓపికపడితే సకుటుంబ సమేతంగా హాయిగా ఇంట్లోనే కూర్చొని చూసి ఆనందించవచ్చు.  

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్‌ తర్వాత కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. 

ఈ సినిమాకు బాబీ కధ, డైలాగ్స్ అందించగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. 2023 జనవరిలో సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతోంది.