
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల జీవితంలో ఆచార్య ఫ్లాప్ ఓ పెద్ద షాక్. ఆ షాక్ నుంచి వారు కోలుకొని వేరే చిత్రాలతో బిజీ అయ్యారు. కానీ ఆచార్య ప్రభావం దానికి దర్శకత్వం వహించిన కొరటాల శివపై బాగా పడింది. అంతకు ముందు ఆయన అనేక హిట్ చిత్రాలు అందించినా, ఆచార్య తర్వాత జూ.ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయగలరా లేదా?అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పైగా వారి కాంబినేషన్‌లో సినిమా ప్రకటించి చాలా రోజులే అయినప్పటికీ దాని గురించి ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో ఆ సినిమా అటకెక్కించేసి ఉండవచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు... ఎన్టీఆర్ మరో దర్శకుడితో సినిమా మొదలుపెట్టేందుకు సిద్దం అవుతున్నాడనే ఊహాగానాలు కూడావినిపిస్తున్నాయి. ఇవన్నీ చూసి ఆ సినిమా పీఆర్‌వో వంశీ కాక ట్విట్టర్‌లో ఈరోజు దాని గురించి తాజా అప్‌డేట్ ఇచ్చారు.
దర్శకుడు కొరటాల శివ, డీఓపీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ముగ్గురూ కలిసి ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారని త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోందని,” సినిమా పీఆర్‌వో వంశీ కాక ట్వీట్ చేశారు. కానీ నేటికీ సినిమా ఎప్పటి నుంచి మొదలుపెడుతున్నారో తేదీ చెప్పకుండా ఇంకా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పడంపై ఎన్టీఆర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.