ఆదిపురుష్‌ రిలీజ్ వేసవికి వాయిదా పడిందట కదా?

తొలిసారిగా ప్రభాస్‌ను చేస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ గాధను ఆదారంగా చేసుకొని ఆదిపురుష్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. కృతీ సనన్, ప్రభాస్‌ సీతారాములుగా, బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా ఈ సినిమాలో నటిస్తున్నారు. 

ఈ సినిమా టీజర్‌, నటీనటుల వేషధారణ, రూపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కానీ సినిమా ప్రజల అంచనాలకు మించి ఉంటుందని దర్శకుడు ఓం రౌత్ బల్లగుద్ది వాదిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా 2023, జనవరి 12న విడుదలచేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఆదిపురుష్‌ సినిమాని వేసవికి వాయిదా వేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఈ సినిమాను భారతీయ, విదేశీయ భాషలతో కలిపి మొత్తం 15 భాషలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నందున, అన్ని భాషలలో డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి ఒకేసారి విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అసలు విషయం... జనవరి నుంచి మార్చి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో చిన్నా, పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదలవుతుంటాయి వాటితో తమ ఆదిపురుష్‌కు నష్టం కలగకూడదనుకొంటే వెనక్కు తగ్గకతప్పదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వేసవి సీజనులో కూడా పెద్ద సినిమాల తాకిడి ఉండనే ఉంటుంది. కనుక మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలతో మాట్లాడుకొని జనవరిలో వారి సినిమాలనే వాయిదా వేయించి ముందు అనుకొన్న ప్రకారం జనవరి 12న ఆదిపురుష్‌ విడుదల చేయాలనే మరో ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఊహాగానాలపై ఆదిపురుష్‌ దర్శకనిర్మాతలు లేదా ప్రభాస్‌ స్పందించవలసి ఉంది. ఆదిపురుష్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.