మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి గత ఏడాది జరిగిన ఎన్నికలలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు హోరాహోరీగా పోరాడుకోవడం చివరికి మంచు విష్ణు ప్యానల్ ఎన్నికవడం, వెంటనే ప్రకాష్ రాజ్ ప్యానల్లో గెలిచిన సభ్యులు రాజీనామాలు చేయడం బహుశః అందరికీ గుర్తుండే ఉంటాయి.
మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్రకాష్ రాజ్ మంచు విష్ణు గురించి మాట్లాడారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు పదవి చేపట్టి ఓ సంవత్సరం పూర్తయింది. మరో సంవత్సరం గడువు ఉంది. కనుక ఆయన మా అందరికీ ఏం చేస్తారో చూద్దాము. ఆయన 90 శాతం పనులు పూర్తిచేశామని చెప్పుకొన్నారు. కానీ అయిపోయాయని చెప్పుకొన్నంత మాత్రన్న అన్ని పనులు చేసేసినట్లు కాదు. ఆయన ఇచ్చిన హామీలలో ఎన్నిటిని నెరవేర్చారో అందరికీ తెలుసు. మళ్ళీ మా ఎన్నికలలో పోటీ చేస్తానా లేదా అనే విషయం ఆలోచించడానికి చాలా సమయం ఉంది. సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి చెప్తాను,” అని ప్రకాష్ రాజ్ అన్నారు.
మంచు విష్ణు హామీలలో తన సొంత ఖర్చుతో ‘మా’కు ఓ శాశ్విత భవనం నిర్మించడం కూడా ఒకటి. దాని కోసం విష్ణు రెండు ప్రతిపాదనలు చేశారు. ఒకటి జూబ్లీహిల్స్లో సిద్దంగా ఉన్న భవనాన్ని కొనుగోలు చేయడం. రెండోది భవనం కోసం భూమి కొనుగోలు చేసి కొత్తది నిర్మించడం. సభ్యులందరూ రెండో ప్రతిపాదనకే మొగ్గు చూపారు.
మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. కనుక ఈ పరిస్థితులలో అతను కోట్లు ఖర్చు చేసి స్థలం కొని మాకోసం భవనం నిర్మిస్తాడా... లేదా? అని మాలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి విష్ణు ఆ హామీ నిలబెట్టుకొంటాడో లేదా మంచులా కరిగిపోతుందో చూడాలి.