ఓటీటీలోకి కాంతారా... అప్పుడే కాదు: నిర్మాత

అందరూ మెచ్చుకొనే మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు వాటిని ధియేటర్లలో చూసి ఆనందిస్తే వారికీ బాగుంటుంది... సినిమా తీసిన నిర్మాతలకు లాభాలు, నటీనటులకు సంతోషం, తృప్తి కలుగుతాయి. అయినా వివిద కారణాలతో ధియేటర్లకి వెళ్ళి సినిమాలు చూడలేకపోతున్నవారు మాత్రం అటువంటి మంచి సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే ధియేటర్లలో హౌస్‌ఫుల్‌గా ఆడుతున్న సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని మీడియాకు బాగా తెలిసి ఉన్నప్పటికీ, తమ రేటింగ్ పెంచుకొనేందుకు లేదా ఓటీటీ ప్రేక్షకుల బలహీనతను ఆదారంగా చేసుకొని వార్తలు నింపడం కోసమో ఇదిగో వచ్చేస్తోంది అదిగో వచ్చేస్తోంది... అంటూ లేనిపోని పుకార్లతో పేజీలు నింపేస్తుంటారు. 

ఎటువంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్‌ 30వ తేదీన విడుదలైన కాంతార సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాని గురించి కూడా ఇలాగే పుకార్లు వ్యాపింపజేశారు. కాంతారాకు రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటంతో మరిన్ని ధియేటర్లలో విడుదల చేస్తున్నామని కనుక ఇప్పుడప్పుడే ఓటీటీలో తమ సినిమాను రిలీజ్ చేయడం లేదని ఆ సినిమా నిర్మాత విజయ్ స్వయంగా చెప్పారు. అయితే కాంతారాను ఎప్పుడు రిలీజ్ చేయాలనుకొన్నా ఆ విషయం చాలా ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు. వచ్చే నెల 14వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ కోసం కాంతారా స్పెషల్ షో వేయబోతున్నట్లు తెలిపారు. ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రిషబ్ శెట్టి కూడా ప్రధానితో పాటు సినిమాను చూస్తారని చెప్పారు.

కాంతారను రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం చేసి నటించారు. కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సపతమి గౌడ తదితరులు దీనిలో ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు కెమెరా: అర్వింద్ కె కశ్యప్, సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్ అందించారు.   

హొమ్‌బలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను కేవలం రూ.16 కోట్లు బడ్జెట్‌తో నిర్మించగా ఇప్పటి వరకు రూ. 200 కోట్లు పైనే వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.