లైగర్‌ బాధితులు ధర్నా... నన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా?పూరీ ఆగ్రహం

పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్‌ చిత్రం దారుణంగా ఫ్లాప్ అవడంతో భారీ సొమ్ము చెల్లించి దాని డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ భారీగా నష్టపోయారు. కనుక విజయ్ దేవరకొండ తాను తీసుకొన్న పారితోషికంలో చాలా వరకు వెనక్కు ఇచ్చేయగా, దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా డిస్ట్రిబ్యూటర్లకు నెలరోజుల లోపు కొంత సొమ్ము తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు ఆయనకు-వారికి మద్య ఒప్పందం కూడా జరిగింది. కానీ వారిలో కొందరు ఈనెల 27న ఆయన ఇంటి ముందు ధర్నా చేసేందుకు సిద్దం అవుతూ వాట్సప్ గ్రూపులలో పంపుకొన్న మెసేజులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో పూరీ జగన్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖుడితో ఫోన్‌లో మాట్లాడిన మాటలు కూడా లీక్ అయ్యి అవి కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేయాలనుకోవడం, పూరీ అందుకు ఆగ్రహించి వారికి ఒక్క పైసా కూడా ఇవ్వనని చెప్పడం ప్రస్తుతం టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. 

ఈ విషయం తెలుసుకొన్న పూరీ మండిపడుతూ ఏమన్నారంటే... “వాళ్ళు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తారా? ఇక వాళ్ళకి దమ్మీడీ కూడా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోమను. వాళ్ళూ నష్టపోయారు కదా అని కొంత సొమ్ము వారికి నెలరోజులలో తిరిగి ఇచ్చేసేందుకు నేను అంగీకరించాను. డిస్ట్రిబ్యూటర్లతో జరిగిన సమావేశంలో వారూ అందుకు అంగీకరించారు. నా పరువు కాపాడుకోవడానికే నేను వారికి డబ్బు తిరిగి ఇవ్వడానికి సిద్దపడ్డాను. కానీ వారు నా పరువు తీసేందుకు ధర్నా చేయాలనుకొంటే ఇక ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? సినిమాలు తీయడం కూడా ఓ గ్యాంబ్లింగ్ వంటిదే. వాటిలో కొన్ని ఆడతాయి కొన్ని పోతుంటాయి. ఒకవేళ లైగర్‌ హిట్ అయ్యుంటే మేము డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మాకూర్ రావాల్సిన సొమ్ము రాబట్టుకోవడానికి నానాపాట్లు పడాల్సి వచ్చేది కదా? పోకిరీ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు డిస్ట్రిబ్యూటర్స్ నాకు ఈయవలసిన సోమ్మే ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు నా ఇంటి ముందు ధర్నా చేస్తామంతున్న బయ్యర్స్ అసోసియేషన్ ఆ సొమ్ము వసూలు చేసి నాకు ఇవ్వగలదా?నా ఇంటి ముందు ఎవరెవరు ధర్నా చేస్తారో వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం చేస్తారో చేసుకోమనండి. ఒప్పందానికి కట్టుబడి ఉన్న మిగిలినవారికి మాత్రమే ఇస్తాను,” అని పూరీ జగన్నాథ్ మాట్లాడిన ఫోన్‌లో మాటలు మీడియాకు లీక్ అయ్యాయి.       

డిస్ట్రిబ్యూటర్స్ పంపుకొంటున్న వాట్సప్ మెసేజ్ ఇదే: