దీపావళికి మెగా బహుమతి... వాల్తేర్ వీరయ్య టీజర్‌

మెగాస్టార్ చిరంజీవి-కెఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్‌ వాల్తేర్ వీరయ్యగా ఖరారు చేశారు. “దీపావళి పండుగనాడు బాస్ వస్తున్నాడు... మాస్ మూల విరాట్‌కి స్వాగతం పలుకుదాం,” అని ముందే ట్విట్టర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే ఇవాళ్ళ ఉదయం 11.07 గంటలకు వాల్తేర్ వీరయ్య టీజర్‌ కూడా విడుదల చేశారు. 

టీజర్‌లో విలన్ “ఏంట్రా వాడొస్తే పూనకాలన్నారు... అడుగేస్తే అరాచకాలు అన్నారు... ఏడ్రా మీ అన్నయ్య?సౌండే లేదు...” అని మాట ముగించేలోగా పెద్ద దమాకాతో విలన్‌ని లేపేసినట్లు టీజర్‌లో చూపారు. ఆ తర్వాత లుంగీ మడతెట్టి, నోట్లో బీడీ వెలిగించి స్టయిల్‌గా పొగ వదులుతున్న వాల్తేర్ వీరయ్య పాత్రలో మెగాస్టార్ చిరంజీవిని టీజర్‌లో చూపారు. 

చివరిగా బ్యాక్ గ్రౌండ్‌లో భారీ దమాకాను చిరంజీవి సెల్ఫీ తీసుకొంటూ “ఇలాంటి ఎంటర్‌టెయినింగ్ దమాకాలు ఇంకా చూడాలనుకొంటే లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టూ... వాల్తేర్ వీరయ్య…” అంటూ చాలా స్టయిలిష్ చెప్పడం చాలా బాగుంది. వాల్తేర్ వీరయ్య టీజర్‌ చూస్తే ఇది కూడా చిరంజీవి మార్క్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌ర్‌ అనే అర్దమవుతుంది.     

వాల్తేర్ వీరయ్యలో చిరంజీవికి జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాకు బాబీ కధ, డైలాగ్స్ అందించగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. 2023 జనవరిలో సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కాబోతోంది.