జపాన్‌లో ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ఫ్యామిలీస్ హంగామా

ఇక్కడ జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ అభిమానులు మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోయే గొప్ప అని సోషల్ మీడియాలో యుద్ధం చేస్తుంటే, అక్కడ జపాన్‌లో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ కుటుంబాలు చేతిలో చేయి వేసుకొని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. తాము నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం శుక్రవారం జపాన్‌లో విడుదలవుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ దంపతులు జపాన్ చేరుకోగా అక్కడ వారికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆ దేశంలో జరిగిన సినిమా ప్రమోషన్స్‌లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ దంపతులు చేతిలో గులాబీ పూలు పట్టుకొని రోడ్డు మీద జీబ్రాలైన్స్ క్రాస్ చేస్తుండగా తీసిన వీడియోకి ఆర్ఆర్ఆర్ చిత్రంలోని పాటని జత చేసి రామ్ చరణ్‌ సోషల్ మీడియాలో తమ అభిమానులకు షేర్ చేశారు. మొదట రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ తర్వాత యావత్ దేశంలో... ఇప్పుడు విదేశాలలో కూడా మన తెలుగు సినిమా, తెలుగు హీరోలు ఇంతగా పేరు ప్రఖ్యాతులు, ఆదరణ సంపాదించుకోవడం, వారి వలన, వారి సినిమాల వలన మన తెలుగువారికి, దేశానికి కూడా గర్వకారణమే కదా.