బాలయ్య సినిమా టైటిల్... వీరసింహారెడ్డి

గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా పేరు ప్రకటించారు. కర్నూలు పట్టణంలో కొండారెడ్డి బురుజు వద్ద నిన్న రాత్రి 8.15 గంటలకు బాలయ్య అభిమానుల మద్య ఈ సినిమా పేరు  వీరసింహారెడ్డి అని ప్రకటించారు. దీంతోపాటు టైటిల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పులిచర్ల 4కిమీ మైలురాయిపై బాలయ్య కాలు పెట్టి నిలబడినట్లు చూపారు. మైలురాయి పక్కనే బాలయ్య ఆయుధం, బ్యాక్ గ్రౌండ్‌లో బారులుతీరి వరుసగా వస్తున్న కార్లు ఉన్నాయి.దాని కిందన గాడ్ ఆఫ్ మాసస్ అనే సబ్ టైటిల్ ఇచ్చారు. టైటిల్‌ పోస్టర్‌లో బాలయ్యని పూర్తిగా చూపకపోయినప్పటికీ ఆ సీన్ చూస్తే బాలయ్య యుద్ధానికి సిద్దమన్నట్లు తొడగొట్టి నిలబడినట్లు స్పష్టంగా అర్దం అవుతోంది. సినిమా టైటిల్‌, పోస్టర్‌ రెండూ కూడా బాలయ్య అభిమానుల అంచనాలకు మించి ఉండటం వారు ఉప్పొంగి పోయారు.

ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, లాల్, చంద్రికా రవి తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి సుమారు రూ.70 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కెమెరా రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్.ధమన్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమా విడుదల కాబోతోంది.