
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా చేసిన లైగర్ హిట్ అయ్యుండి ఉంటే నేడు వారు ముగ్గురూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేవారు కానీ ఆ సినిమా బోర్లా పడటమే కాకుండా వారికి ఇండస్ట్రీలో చాలా చెడ్డపేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత పూరీ, విజయ్ దేవరకొండ కలిసి జనగణమన సినిమా తీద్దామనుకొన్నారు. కానీ లైగర్ పంచ్ దెబ్బకి మళ్ళీ ఇద్దరూ ఇప్పట్లో కలిసి పనిచేయడానికి సాహసించలేకపోతున్నారు. కనుక ప్రస్తుతానికి పూరీ డ్రీమ్ ప్రాజెక్టు జనగణమన అటకెక్కినట్లే.
లైగర్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొంటున్న విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా పూర్తిచేద్దామనుకొంటే దానిలో హీరోయిన్‌గా చేస్తున్న సమంతకు ఆరోగ్యం బాగోకపోవడంతో అదీ వాయిదా పడింది. ఇదే సమయంలో ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండకి ఓ లైన్ వినిపించారు. అది ఫీల్ గుడ్ సినిమాగా రూపొందించాలనుకొన్నట్లు గౌతమ్ చెప్పడంతో విజయ్ దానికి ఓకే చెప్పేశాడు. పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేసి తీసుకురామన్నామని చెప్పాడు. బహుశః వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.
ఈలోగా సమంత సిద్దమైతే ఖుషీ పూర్తి చేయాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందబోతున్న ఖుషీ సినిమాలో మురళీ శర్మ, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జయరాం, సచిన్ కేడేకర్, లక్ష్మి, శరణ్యా అయ్యంగార్, రోహిణి ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరుపుకొని వెంటనే కశ్మీర్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టిన్నప్పటికీ, ఆ తర్వాత విజయ్ దేవరకొండ లైగర్‌తో బిజీ అయిపోవడం, సమంత అనారోగ్యం కారణంగా ఇంతవరకు పూర్తి కాలేదు. ఇప్పుడు సమంత నటించిన యశోద షూటింగ్ పూర్తయినందున ఆమె కూడా ఫ్రీ అయ్యింది. కనుక త్వరలోనే ఖుషీ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.