బాలయ్య సినిమా టైటిల్ 21న... కొండారెడ్డి బురుజు దగ్గర

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్‌తో సిద్దం అవుతున్న మాస్ మసాలా మూవీ టైటిల్ ఇదేనంటూ చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అవేవీ తమ సినిమా టైటిల్స్ కావని, బాలయ్య మాస్ ఇమేజ్‌కి తగ్గట్లుగా మంచి పవర్‌ఫుల్ టైటిల్ ఉంటుందని దర్శకుడు గోపీచంద్ మలినేని ఇదివరకే చెప్పాడు. ఈనెల 21వ తేదీన కర్నూల్ పట్టణంలోని చారిత్రిక కొండారెడ్డి బురుజు వద్ద రాత్రి 8.15 గంటలకు బాలయ్య సినిమా టైటిల్ ప్రకటిస్తామని దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో ఈరోజు ప్రకటించాడు.

ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, లాల్, చంద్రికా రవి తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుమారు రూ.70 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కెమెరా రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్.ధమన్ అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 23న ఈ సినిమా విడుదల కాబోతోంది.