
రామాయణ, మహాభారతాలను ఎవరు ఎన్నిసార్లు సినిమాగా తీసిన దేశ ప్రజలు చూసి ఆదరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో ఎంతగొప్పగా రామాయణం సినిమా తీసినప్పటికీ, ఒక తెలుగు నిర్మాత తెలుగులో తీస్తే దానికి ఉండే ఆదరణే వేరు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా రామాయణ గాధను సినిమాగా తీయాలని ఎన్నో ఏళ్ళుగా కలలుకంటున్నారు. అయితే ఆయన కేవలం కలలతో సరిపెట్టుకొనే నిర్మాత కాదని అందరికీ తెలుసు. రామాయణంపై సినిమా తీయాలని నిర్ణయించుకొన్నప్పటి నుంచి దాని కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు చేస్తున్నామని ఆయనే స్వయంగా చెప్పారు. గత నాలుగేళ్ళుగా ఈ పనులు జరుగుతున్నాయని అవి పూర్తికాగానే సినిమా ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని అల్లు అరవింద్ చెప్పారు. అయితే దాని కోసం తొందరపడదలచుకోలేదని చెప్పారు. తమ రామాయణం యావత్ దేశప్రజలను మెప్పించేవిదంగా చాలా గొప్పగా ఉంటుందని అల్లు అరవింద్ చెప్పారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవగానే ఆ వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
తమ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అర్జున్, రామ్ చరణ్‌లతో కలిసి ఓ సినిమా తీయాలనే మరో తీరని కోరిక మిగిలిపోయిందని అల్లు అరవింద్ చెప్పారు. ఏదో ఓ రోజున తప్పకుండా అదీ తీరుతుందని భావిస్తున్నానని చెప్పారు. తాను డిస్ట్రిబ్యూట్ హక్కులు తీసుకొని తెలుగులో విడుదల చేసిన కాంతార సినిమా సూపర్ హిట్ అవడం తనకు చాలా సంతోషం కలిగించిందని అల్లు అరవింద్ అన్నారు.