
ఇటీవల దసరా పండుగ సందర్భంగా ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన స్వాతిముత్యం సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రాలను తట్టుకొని నిలబడి మంచి టాక్ సంపాదించుకొంది. లక్ష్మణ్ కె దర్శకత్వంలో రూపొందిన స్వాతిముత్యం సినిమాలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో అతనికి జంటగా వర్ష బొల్లమ్మ నటించింది. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీగా యువతను ఆకట్టుకొన్న ఈ సినిమా ఈనెల 28 నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది.
విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేసే అమాయక హీరో, స్కూల్ టీచరుగా పనిచేస్తున్న హీరోయిన్‌ని పెళ్ళి చూపులలో చూసి ప్రేమలో పడి పెళ్ళి చేసుకోబోతుంటే సరిగ్గా అదే సమయానికి మరో యువతి వచ్చి ఇదిగో నీ బిడ్డ అంటూ తొమ్మిది నెలల పిల్లాడిని అతని చేతిలో పెడుతుంది. హీరో కూడా ఆ పిల్లాడు తన కొడుకే అని ఒప్పుకొంటాడు. పెళ్ళి పీటలపై ఈ ట్విస్టే ఈ సినిమా కధాంశం. ఇటీవల కాలంలో వచ్చిన ఓ మంచి సినిమాగా పేరు సంపాదించుకొన్న స్వాతిముత్యం ఇప్పుడు ఆహా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది.