రామ్ చరణ్‌, ఉపాసన ప్రత్యేక విమానంలో జపాన్‌కి

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం భారత్‌లోనే కాకుండా విదేశాలలో కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో ఆ సినిమాను జపాన్ భాషలో డబ్బింగ్ చేసి ఈనెల 21న ఆ దేశంలో విడుదల చేయబోతున్నారు. కనుక ఆ సినిమా ప్రమోషన్స్‌ కోసం రామ్ చరణ్‌ తన భార్య ఉపాసనతో కలిసి ప్రత్యేక విమానంలో జపాన్ రాజధాని టోక్యోకి బయలుదేరి వెళ్ళారు. వారిద్దరూ శంషాబాద్‌ విమానాశ్రయంలో టోక్యోకి బయలుదేరుతుండగా రామ్ చరణ్‌ అభిమాని ఒకరు తన మొబైల్ ఫోన్‌లో వారి ఫోటోను తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. రాజమౌళి మిగిలిన చిత్ర బృందం వేరే విమానంలో వారిని జపాన్‌లో కలుస్తారని అభిమాని తెలిపాడు.          

ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ,1200 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టి బాహుబలి రికార్డులను తిరగరాసింది. భారత్‌ తరపున ఆస్కార్ అవార్డులకు నామినేట్ అవుతుందని అందరూ భావించినప్పటికీ, గుజరాతీ సినిమా చెల్లో షోని ఎంపిక చేయడంతో ఆర్ఆర్ఆర్ దర్శక నిర్మాతలు నేరుగా ఆస్కార్ అవార్డుల కమిటీకి తమ చిత్రాన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ వివిద విభాగాల కింద దరఖాస్తు చేసుకొన్నారు. ఈ సమయంలో ఆర్ఆర్ఆర్ చిత్రం జపాన్ భాషలోకి డబ్ చేసి విడుదల చేయడం ఆస్కార్ పరిశీలనకు ఎంతో కొంత తోడ్పడవచ్చు.