
కొన్నేళ్ళ క్రితం సూపర్ హిట్ అయిన హీరోల సినిమాలను మళ్ళీ మరోసారి విడుదల చేసే ట్రెండ్ టాలీవుడ్‌లో మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలు రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు ప్రభాస్-మెహర్ రాజా కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘బిల్లా’ సినిమా 4కె లేటెస్ట్ వెర్షన్‌ను ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క, హన్సిక, నమిత, జయసుదలను మరోసారి తెరపై చూసుకొని ఆనాడు వారు ఎలాఉండేవారో ఇప్పుడు ఎలా ఉన్నారో పోల్చి చూసుకొనే అవకాశం అభిమానులకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఉన్నందున ప్రభాస్ ఈ సినిమాను ఎంచుకొన్నారు.
తన పుట్టినరోజున పెదనాన్నతో కలిసి ఈ సినిమాను చూద్దామనుకొన్నానని కానీ ఈలోగా ఆయన స్వర్గస్తులయ్యారని ప్రభాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ అంతా యూకే-ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వబోతున్నట్లు ప్రభాస్ చెప్పారు. కృష్ణంరాజు చివరి రోజుల్లో షుగర్ వ్యాధి కారణంగా ఆయన పాదంలో కొంత భాగం తొలగించవలసి వచ్చింది. అంతకు ముందునుంచే ఆయన ఈ ఫౌండేషన్‌లో భాగస్వామిగా ఉన్నారు.
ఇక ఈ సినిమా గురించి మరోసారి గుర్తు చేసుకొంటే గోపీ కృష్ణా మూవీస్ బ్యానర్‌పై డి నరేంద్ర నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా రామజోగయ్య పాటలు అందించారు. ఆరోజుల్లోనే దీని కోసం రూ.26 కోట్లు ఖర్చు పెట్టి చాలా స్టయిలిష్గా తీసారు. ఈ సినిమా 2009, ఏప్రిల్ 3వ తేదీన విడుదలై సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ఈనెల 23న వస్తోంది.