నాగ్ ఓకే చెప్పేశాడు కానీ ఆర్నెల్ల తర్వాతేనట!

ఆచార్య దెబ్బకు డీలాపడిన మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు మోహన్ రాజా గాడ్ ఫాదర్‌తో మళ్ళీ హుషారెక్కించారు. నిజానికి ఆయన మొదట నాగార్జునతోనే సినిమా చేయాల్సి ఉందట. నాగ్ తన 100వ సినిమా కోసం మంచి కధ కోసం చూస్తుండగా మోహన్ రాజా చెప్పిన ఓ కధ విని చాలా ఇంప్రెస్ అయ్యి వెంటనే దానికి ఓకే చెప్పేశారట! అయితే దానిని సిద్దం చేస్తుండగా చిరంజీవి గాడ్ ఫాదర్‌ ఆఫర్ ఇవ్వడంతో మోహన్ రాజా దానికి షిఫ్ట్ అయ్యారట! ఇందుకోసం చిరంజీవి స్వయంగా నాగార్జునతో మాట్లాడి ఒప్పించారట!

ఈలోగా నాగార్జున ప్రవీణ్ సత్తారుతో ది ఘోస్ట్ పేరుతో మంచి యాక్షన్ సినిమా చేశాడు కానీ ప్రేక్షకులు దానిని రిజక్ట్ చేయడంతో నాగ్ చాలా నిరాశపడ్డారు. ఘోస్ట్ తర్వాత ఓ ఆరు నెలలు బ్రేక్ తీసుకొంటానని నాగ్ ముందే చెప్పడంతో ఇప్పుడు మోహన్ రాజా ఖాళీ అయినప్పటికీ సినిమా మొదలుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.

అయితే చిరంజీవిలాగే ఘోస్ట్ తో దెబ్బ తిన్న నాగ్‌కు కూడా ఓ మంచి సూపర్ హిట్ ఇవ్వాలని మోహన్ రాజా పట్టుదలగా ఉన్నారట! నాగ్ 100వ చిత్రాన్ని గ్రాండ్ సక్సస్ చేసి ఆయన సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలపాలననుకొంటున్న దర్శకుడు మోహన్ రాజా, నాగ్ కోసం వ్రాసిన కధకు మరోసారి నగిషీలు చెక్కి సిద్దం చేసుకొంటున్నారట! అది సిద్దమయ్యేసరికి నాగ్ కూడా సిద్దమైతే షూటింగ్‌ మొదలుపెట్టేస్తానని మోహన్ రాజా చెప్పారు. ఆ సినిమా ఎమ్మోషనల్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం. దానిలో అఖిల్ ఓ కీలకపాత్ర చేయబోతున్నాడట!