కలర్ ఫోటో బాగానే పడింది కదా... అందుకే కారు గిఫ్ట్!

 సందీప్ రాజ్‌ దర్శకత్వంలో సాయి రాజేష్ నిర్మించిన కలర్ ఫోటో సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా కరోనా కష్టకాలంలో నిశబ్ధంగా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ సూపర్ హిట్ అయ్యింది. దానికి మంచి మార్కులు పడటంతో దాని దర్శక, నిర్మాతలకి మంచి పేరు వచ్చింది. ఇటీవల వారిరువురూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డు కూడా అందుకొన్నారు. భారీ బడ్జెట్‌తో ఎన్నో సినిమాలు తీసిన పెద్దపెద్ద దర్శకనిర్మాతలు కూడా ఇంతవరకు ఇటువంటి అవార్డుకి నోచుకోలేదు. కానీ తొలి సినిమాతోనే అదీ... ఓటీటీలో విడుదలైన సినిమాతోనే జాతీయ అవార్డు అందుకోవడంతో ఇప్పుడు సాయి రాజేష్ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది.

అప్పుడప్పుడు నిర్మాతగా సినిమాలే తీసే అలవాటున్న దర్శకుడు మారుతి, మరో నిర్మాత కెవిఎన్‌ (కె.శ్రీనివాస్)తో కలిసి సాయి రాజేష్ దర్శకత్వంలో ‘బేబీ’ అనే సినిమాని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే వారిరువురూ ఇంకా సినిమా రిలీజ్ అయ్యి దాని ఫలితం ఏవిదంగా ఉంటుందో చూడక మునుపే దర్శకుడు సాయి రాజేష్కి ఓ కారు బహుమానంగా ఇచ్చారు. అది చూసి సాయి రాజేష్ కూడా షాక్ అయ్యాడు కానీ తనపై ఇంత నమ్మకముంచి ఇంత ఖరీదైన బహుమతి ముందే ఇస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.