
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో దర్శకుడు పూరీ కూడా గోవర్దన్ అనే పాత్ర చేసిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ విజయం సాధించడంతో చిరంజీవి తొలిసారిగా ఇన్‌స్టాగ్రామ్‌లో పూరీతో లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ అనేక ఆసక్తికరమైన విషయాలు తమ అభిమానులతో పంచుకొన్నారు.
“మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు?” అనే పూరీ ప్రశ్నకు చిరంజీవి చెప్పిన జవాబు అందరినీ ఆశ్చర్యపరిచింది. “ఇప్పటి రాజకీయనాయకులలో నాకు నచ్చినవారు ఎవరూ లేరు. దివంగత ప్రధానులు లాల్ బహద్దూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్‌పేయిలను నేను అభిమానిస్తాను. మహానుభావులు వారిద్దరూ,” అని చిరంజీవి చెప్పారు.
తెలుగువారికి సంబందించినంత వరకు ప్రస్తుత రాజకీయ నాయకులలో తెలంగాణ సిఎం కేసీఆర్, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఉండగా, జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. ఈ ముగ్గురితో చిరంజీవికి సత్సంబందాలు ఉన్నప్పటికీ వారిలో ఏ ఒక్కరిని తాను అభిమానించడం లేదని చెప్పకనే చెప్పడం విశేషం.
సినిమాల విషయానికి వస్తే ఓ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ‘హీలింగ్ టైమ్’ నెలరోజులకు మించి నాకు ఉండదని దర్శకుడు పూరీ చెప్పడం, ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మరో సినిమా చేస్తున్నప్పుడు ఆ ఫ్లాప్‌ని తలుచుకొంటూ భయపడకుండా చేస్తున్న సినిమాపై పూర్తి నమ్మకం ఉంచి షూటింగ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేయాలని చిరంజీవి చెప్పడం సినీ పరిశ్రమలో అందరికీ ఉపయోగపడే మంచి సలహాలే.
పూరీ-చిరంజీవి ఇద్దరూ తమ లైవ్ ఇంటర్వ్యూలో ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకొన్నారు. వారి అభిమానులు, సినీ ప్రియులు అందరూ తప్పక దానిని వినితీరాల్సిందే.